సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు : కలెక్టర్‌

Oct 9,2024 21:28

ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆదేశించారు. ఈ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై తమ ఛాంబర్‌లో బుధవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ఈనెల 16న ప్రారంభించి, నవంబరు 24న ముగుస్తుందని చెప్పారు. విజయనగరం డివిజన్‌లో 267 సంఘాలు, పార్వతీపురం డివిజన్‌(బొబ్బిలి సబ్‌ డివిజన్‌)లో 30, శ్రీకాకుళం డివిజన్‌ (పాలకొండ సబ్‌డివిజన్‌)లో 75, మడ్డువలస రిజర్వాయర్‌ ప్రాజెక్టు పరిధిలో 15, మొత్తం 387 సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. వీటిపరిధిలో 2,628 టిసిలు ఉన్నాయని తెలిపారు. ఖచ్చితమైన ఓటర్ల జాబితాలను సిద్దం చేసి ఎన్నికల ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌, సాగునీటి సంఘాల ఎన్నికల నోడల్‌ ఆఫీసర్‌, ఇరిగేషన్‌ ఇఇ ఎం.వెంకటరమణ, వివిధ ప్రాజెక్టుల డిఇలు పాల్గొన్నారు.

➡️