ప్రజాశక్తి- భట్టిప్రోలు : ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువైన 36 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు రేపల్లె డిఎస్‌పి ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేక్ల సమావేశంలో డిఎస్‌పి వివరాలు వెల్లడించారు. తెనాలి మహేంద్ర కాలనీకి చెందిన పుట్ట శివ శంకర్, చెరుకుపల్లి మండలం కనగాల గ్రామానికి చెందిన పీటా నాగబాబు , భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన దీపాల తేజ వెంకట శివ నాగ విజయ కుమార్ ముఠాగా ఏర్పడి బైకులను చోరీ చేస్తున్నట్లు తెలిపారు. వీరిపై బాపట్ల, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, కష్ణ జిల్లాలతోపాటు తెలంగాణా రాష్ట్రంలో కలిపి మొత్తం 17 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎస్‌పి తుషార్ దూడి ఆదేశాల మేరకు రేపల్లె డిఎస్‌పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేమూరు సిఐ పసుపులేటి వీరాంజనేయులు రేపల్లె రూరల్ సిఐ సురేష్ బాబు సారధ్యంలో భట్టిప్రోలు, చెరుకుపల్లి ఎస్‌ఐ శివయ్య, అనీల్ కుమార్, పోలీసు సిబ్బందితో ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారు సిసి కెమెరాల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు పుట్ట శివశంకర్ ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని చెరుకుపల్లి మండలం, కనగాల గ్రామానికి చెందిన పీట నాగబాబు, భట్టిప్రోలు మండలం, ఐలవరం గ్రామానికి చెందిన దీపాల తేజ వెంకట శివ నాగ విజయ కుమార్ ద్వారా దాచిపెట్టినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి బైకులు స్వాధీనం చేసుకోవడంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రేపల్లె డిఎస్‌పి, వేమూరు, రేపల్లె రూరల్ సిలు, భట్టిప్రోలు, చెరుకుపల్లి ఎస్‌ఐలు, వారి సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్‌పి తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారు.
