రూ.40.50 లక్షలతో ఉడాయించిన మధ్యవర్తి అరెస్టు

Mar 23,2025 00:55

ప్రజాశక్తి – మాచర్ల : పొలం క్రయ విక్రయంలో మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ఇరుపక్షాలను మోసం చేసి నగదుతో పరావగా పట్టణ ఎస్‌ఐ సంధ్యారాణి చాకచక్యంతో పట్టుకున్నారని సిఐ ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ మేరకు శనివారం పట్టణ పోలీస్‌ స్టేషన్లో వివరాలను విలేకర్లకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామానికి చెందిన బందెల నరసింహారెడ్డి 2022లో దుర్గి మండలం ముటుకూరు గ్రామ శివారులో 6.88 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేయగా సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మైలా మల్లేష్‌ యాదవ్‌ సదరు పొలం అమ్మకంలో మధ్యవర్తిగా వ్యవహరించాడు. పొలం కొనుగోలుకు ముందుకు వచ్చిన దుర్గి మండలానికి చెందిన మాదాసు వెంకటేశ్వర్లుకు రూ.70.50 లక్షలకు అమ్మే విధంగా మాట్లాడుకున్నారు. అడ్వాన్సుగా రూ.45 లక్షలను మాదాసు వెంకటేశ్వర్లు మధ్యవర్తి మల్లేష్‌ యాదవ్‌కు ఇవ్వగా ఆ నగదు నుండి పొలం యజమాని నర్సింహారెడ్డికి రూ.30 లక్షలే ఇచ్చి రూ.15 లక్షలు తన వద్దే ఉంచుకున్నాడు. మిగతా నగదు రిజిస్ట్రేషన్‌ రోజున ఇస్తానన్నాడు. అదినమ్మి ఈ నెల 15వ తేదీన పొలాన్ని మాదాసు వెంకటేశ్వర్లకు నరసింహారెడ్డి రిజిస్ట్రేషన్‌ చేశాడు. మాదాసు వెంకటేశ్వర్లు ఒప్పందము మేరకు మిగిలిన సొమ్ము రూ.25.50 లక్షలు మల్లేషు యాదవ్‌కు ఇచ్చాడు. ఈ నగదుతో పాటు అడ్వాన్సుగా ఇచ్చిన మొత్తంలో తన వద్దే వుంచుకున్న రూ.15 లక్షలు మొత్తం రూ.40.50 లక్షలతో మల్లేష్‌ యాదవ్‌ ఉడాయించాడు. నరసింహారెడ్డి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా మల్లేష్‌ యాదవ్‌ స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సంధ్యారాణి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మల్లేష్‌ యాదవ్‌ చిత్తూరు జిల్లాలో ఉన్నట్లు గుర్తించి, ప్రత్యేక బృందంతో అదుపులోకి తీసుకుని రూ.20 లక్షలను రికవరీ చేశారు. నిందితుణ్ణి మాచర్ల కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌ విధించారు.

➡️