భిక్షాటన చేస్తున్న మున్సిపల్ కార్మికులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తాము పని చేసినా జీతం సరిగా ఇవ్వని కారణంగా భిక్షాటన ద్వారా కుటుంబాల్ని పోషించు కోవాల్సిన దుస్థితి వచ్చిందని నరసరావుపేట మున్సిపల్ పారిశుధ్య బదిలీ కార్మికులు ఆవేదనకు గురవుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం 23 రోజులుగా ఆందోళన చేపట్టిన కార్మికులు శుక్రవారమూ భిక్షాటన ద్వారా నిరసనను కొనసాగించారు. తొలుత దీక్ష శిబిరంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు సిలార్ మసూద్ పూలమాలలేసి నివాళులర్పించారు. పూలే స్పూర్తితో పోరాడి హక్కులు సాధించుకుం దామని పిలుపునిచ్చారు. తమపట్ల వివక్ష, సమస్యల పట్ల నిర్లక్ష్యం అధికారులు, ప్రజాప్రతినిధులు కొనసాగిస్తే నిరవధిక సమ్మెకూ వెనకాడబోమని కార్మికులు హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు జె.వీరమ్మ, సమాధానం, సెల్వి, లత, నాగమణి, శ్రీను, చంద్రయ్య, రాజు, ఖాదర్‌వలి, వీరయ్య, సాంబయ్య, అబ్రహం, సాల్మన్, దేవా, జీవరత్నం, వీరకుమార్, నవీన్ పాల్గొన్నారు.
