సమాజ చైతన్యానికి కళలు పునాది కావాలి

Jan 11,2025 16:38 #Kurnool

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : సమాజ చైతన్యానికి కళలు పునాదిగా మారాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని స్థానిక కె.కె.భవన్లో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తొలుత అమరుడు సఫ్దర్ హష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ సంఘం ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి .గౌస్ దేశాయ్, వైయస్సార్ టి యు సి జిల్లా అధ్యక్షులు భీమేశ్వర్ రెడ్డి, పందిపాడు టిడిపి నాయకులు పూల శంకర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్. రాధాకృష్ణ, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఆనంద్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.వి. నారాయణ, ఏపీ .రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి గురు శేఖర్, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్. అలివేలు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈ.నాగరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పిఎన్ఎం జిల్లా ఉపాధ్యక్షులు ఎం. లోకేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ… ప్రజానాట్యమండలి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తుందన్నారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు పాలకులను కళల ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తుందన్నారు. కళ కల కోసం కాకుండా సమాజం కోసం ఉపయోగపడేలా ఉండాలన్నారు. అందుకు సఫ్దర్ హస్మి జీవితం ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. కళలు చైతన్యాన్ని నింపేవిగా ఉండాలన్నారు. ఆ దిశగా అమరుల చిత్రాలతో కూడిన నూతన క్యాలెండరును ప్రజానాట్యమండలి ప్రచురించడం అభినందనీయమన్నారు. వారి జీవితాలు పదుగురికి స్ఫూర్తిని నింపేలా ఉన్నాయన్నారు. క్యాలెండర్ ప్రచురణకు సహకరించిన దాతలకు అభినందనలు తెలిపారు. ఇదే సహకారాన్ని, స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఈ సందర్భంగా పలు అభ్యుదయ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పిఎన్ఎం జిల్లా నాయకులు రాంబాబు, నోమేశ్వరి, బతుకన్న, సుంకన్న, సుబ్బరాయుడు, పెద్ద కాశీ విశ్వనాథ్, చిన్న కాశీ విశ్వనాథ్, ఆనంద్, నాగస్వాములు, బజారన్న, మధు, సరిత, లక్ష్మి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

➡️