నిబంధనలకు పాతర

Jun 8,2024 21:02

ర్యాంకుల సునామి.. అత్యుత్తమ ఫలితాల్లో మాదే అగ్రగామి.. రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు మా విద్యార్థులకే సొంతం.. అంటూ అందమైన ప్రకటనలతో విద్యార్థులకు గాలం వేస్తున్న కార్పొరేట్‌, ప్రయివేటు విద్యాసంస్థలను. జిల్లాలో నిబంధనలకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం గమనార్హం. విద్యా శాఖ నిబంధనలు పట్టని ఆయా విద్యాసంస్థలు అడ్డుగోలుగా అడ్మిషన్లు దండుతున్నాయి. అట్టపెట్టెల్లాంటి గదుల్లో తరగతులు నిర్వహిస్తూ ఫీజులు మాత్రం ఘోరంగా వసూలు చేస్తున్నాయి.

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాల్లో సుమారుగా 200 ప్రయివేటు జూనియర్‌ కళాశాలలున్నాయి. 500 వరకు ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో పలు ప్రయివేటు, కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ఎక్కడా సరైన గదులు, ఆట స్థలాలు లేకుండానే విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. పలు విద్యా సంస్థలు ఆకర్షణీయమైన ప్రకటనలతో ఊదర గొడుతున్నాయి. అత్యధిక మార్కులు తమ సొంతం.. అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ మాయలో పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నాయి. కార్పొరేట్‌ సంస్థల్లో కాబోయే ఇంజినీర్లు, డాక్టర్లుగా తల్లిదండ్రులు ఊహించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కళాశాలలకు అనుమతులున్నాయో?, లేవో చూసుకోవడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అనుమతులున్న కార్పొరేట్‌ కళాశాలల మాయమాటలు సైతం నమ్మి మోసపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.అసౌకర్యాల నడుమ పలు ప్రయివేటు విద్యాసంస్థల్లో ఇరుకు గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఫ్యాన్లు, మరుగుదొడ్ల కొరత వేధిస్తోంది. సిబ్బంది కొరత మరీ తీవ్రతరంగా ఉంది. విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలు సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితి కొన్నిటిలో కనిపిస్తోంది. ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్న నీటిపైనే ఆధారపడాల్సి వస్తోందని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. సెక్షనుకు 80 మంది విద్యార్థులు, కోటా ప్రకారం సీట్ల కేటాయింపు బిల్డింగ్‌ పర్మిషన్‌, లీజ్‌ అగ్రిమెంట్‌, ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌, పార్కింగ్‌ స్థలం, ఫర్నిచర్‌, కంప్యూటర్‌ గది, సిబ్బంది ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, నాణ్యతమైన బోధనను అందించే ఆధ్యాపకులు లేని విద్యాసంస్థలు జిల్లాలో కోకొల్లలు. వీటిపై పరిశీలన చేసి, అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. అనుమతుల్లేని హాస్టళ్లుజిల్లాలో దాదాపు అన్ని ప్రయివేటు కళాశాలలు అనుమతులు లేకుండానే హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. డిఇఒ, ఇంటర్‌ బోర్డు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే విద్యాసంస్థల్లో హాస్టళ్లు నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వ్యాపారమే పరమావధిగా నిబంధనలకు నీళ్లొదిలేలా ఇష్టానుసారంగా వ్యవహరి స్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలకు ఉపక్రమించకుండా చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అనుమతులు లేకుండానే..జిల్లా కొన్ని విద్యాసంస్థలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నా రంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలలు బ్రాంచుల పేరుతో ఒకటి రెండు విద్యాసంస్థలకు అనుమతులు తీసుకుని, 4, 5 చోట్ల అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు. ఇటువంటి విద్యాసంస్థలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యాసంస్థలకు గుర్తింపు లేకపోతే విద్యార్థులు నష్టపోయే అవకాశాలున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతులు ఉంటే ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు సక్రమంగా అందే అవకాశం ఉంటుంది. గుర్తింపు లేని విద్యా సంస్థల్తో చేరిన విద్యార్ధులకు ఉపకార వేతనాలు రాక, సర్టిఫికెట్లు అందక ఉన్నత విద్యలో చేరేందుకు అడ్డంకులు ఏర్పడతాయి. ఇలా అనేక సమస్యలు వస్తాయి.

➡️