మొక్కుబడిగానే..!

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జడ్‌పి స్టాండింగ్‌ కమిటీ సమావేశం మొక్కబడిగా ముగిసింది. శనివారం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జేష్యాది శారద అధ్యక్షతన జడ్‌పి స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సంబంధిత కమిటీ ఆయా శాఖల అధికారులతో ప్రోగ్రెస్‌ను సమీక్షించాలి. స్టాండింగ్‌ కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి లోపాలపై ప్రశ్నించాలి. సంబంధిత అధికారుల నుంచి సమాధానాలు రాబట్టుకుని, లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలి. సమీక్ష అనంతరం ఆయా శాఖల అధికారులు విధుల నిర్వహణకు వెళ్లి పోవడం పరిపాటి. జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో శాఖల సమీక్ష పూర్తి చేసుకున్న కొందరు అధికారులు తీరికగా ఆశీనులు కావడం ఆశ్చర్యపరిచింది. కడప జిల్లాను కరువు మండలాల జాబితాలో లేకపోవడానికి జిల్లా వ్యవసాయశాఖ సమాధానం చెప్పాలని జిల్లా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యులు కరిముల్లా డిమాండ్‌ చేశారు. జిల్లాలో కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సుమారు 10 మండలాలకుపైగా లోటు వర్ష పాతం నెలకొందని, ఫలితంగా పంటల సాగు లక్ష్యానికి చేరని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాలోని షాదీఖానాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని విమర్శించారు. షాదీఖానా నిర్వహణ ఖర్చుల వినియోగంలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. షాదీఖానా నిర్వహణ ఖర్చులు దుర్విని యోగా నికి పాల్పడిన వారికి నోటీసులు జారీ చేసి రికవరీ చేయాలని నిలదీశారు. దీనికి వక్స్‌బోర్డు అధికారులు స్పందించి జిల్లాలో 12 షాదీఖానాలు ఉన్నాయని, నిర్వహణ ఖర్చుల వినియోగంలో చేతివాటం ప్రదర్శించిన వారికి నోటీసులు జారీ చేసి, రికవరీ చేస్తామన్నారు. అనంతరం పోరుమామిళ్ల జడ్‌పిటిసి అసంపూర్తిగా నిలిచిన అంగన్వాడీ భవన నిర్మాణాలకు జడ్‌పి నిధులతో పూర్తి చేస్తామని చెబితే బిల్లులు చేయలేమని చెబుతున్నారని నిలదీశారు. కార్యక్రమంలో జడ్‌పి వైస్‌ చైర్మన్‌ బాలయ్య, సిఇఒ, డిప్యూటీ సిఇఒ, పలువురు జడ్‌పిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

➡️