ఒప్పంద జీవోలు అమలు చేయాలి
ఎపి ఆశా వర్కర్స్, సిహెచ్‌డబ్ల్యు యూనియన్ రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి
ప్రజాశక్తి – పార్వతీపురం : రాష్ట్రంలోని ఆశా వర్కర్లు, సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనాలు పెంచాలని ఎపి ఆశా వర్కర్లు, సామాజిక ఆరోగ్య కార్యకర్తల సంఘం రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి కోరారు. ఆశా వర్కర్లు, సిహెచ్‌డబ్ల్యు సాధించిన వివరాలు – సవాళ్లు అన్న అంశంపై మంగళవారం ఎపి ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.గౌరి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20ఏళ్లు అయిందని, అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాడి సాధించుకున్నామని చెప్పారు. ఒకప్పుడు ఆశా వర్కర్లకు పనికి తగ్గ పారితోషికం నుంచి రూ.10వేలు వేతనం సాధించామని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు రూ.400 నుండి రూ.4వేలకు వేతనం సాధించామని తెలిపారు. కానీ వీరికి కనీస వేతనం అమలు కావడం లేదన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాడ్యుటీ, యూనిఫామ్ వంటివి ఆశ వర్కర్లకు సాధించామని తెలిపారు. సిహెచ్డబ్ల్యులను ఆశాలుగా గుర్తించాలని, యూనిఫామ్ ఇవ్వాలని, రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని, గుర్తింపు కార్డులు, ఇఎస్‌ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సెలవులు, క్యాజువల్స్ సెలవులు, మెడికల్ లీవ్ ఇవ్వాలని కోరారు. ఆశా వర్కర్లు, సిహెచ్ డబ్ల్యుల సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో జరుగు పోరాటంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు వి.ఇందిర, కార్యదర్శి శివాని, సిఐటియు జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు డి.రమణారావు, వై.మన్మధరావు, నాయకులు లక్ష్మి, గంగాభవానీ, రాజేశ్వరి, మాలతి, లక్ష్మి, భూలక్ష్మి, బివి రమణ, ఎన్వై నాయుడు, సూరిబాబు, జి.వెంకటరమణ, కె.సాంబమూర్తి, అధిక సంఖ్యలో ఆశలు, సిహెచ్డబ్ల్యులు పాల్గొన్నారు.