జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న సామ్రాజ్యం
ప్రజాశక్తి-గుంటూరు : అధికార పార్టీ నాయకులు రాజకీయ వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా, అమరావతి మండలం, ఉంగుటూరుకు చెందిన ఆశా వర్కర్ రాయపాటి సామ్రాజ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విచారణ సమయంలో, విచారణ అధికారి అయిన పల్నాడు జిల్లా డిఎంహెచ్‌ఒ ఎదుటే పురుగుల మందు తాగారు. దీంతో వెంటనే ఆమెను అత్తలూరు పిహెచ్‌సికి తరలించి ప్రాథమిక వైద్యం అనంతరం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)కు తరలించారు. దీనిపై బాధితురాలి కుటుంబీకుల వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామ్రాజ్యంపై గ్రామంలోని అధికార టిడిపికి చెందిన సర్పంచ్ భర్త సోమశేఖర్, అతని అనుచరులు తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నారు. గత 8 నెలలుగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ సామ్రాజ్యం విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ భర్త, అతని అనుచరుల ఫిర్యాదుతో పల్నాడు డిఎంహెచ్‌ఒ అత్తలూరు పిహెచ్‌లోసి విచారణకు రావాలని ఆశా వర్కర్‌ను మంగళవారం పిలిపించారు. ఆశా వర్కర్, ఆమె భర్తను వెంటబెట్టుకొని పిహెచ్‌సి వద్దకు వెళ్లారు. అదే సమయంలో సర్పంచ్ భర్త, అతని అనుచరులు దాదాపు వంద మంది పిహెచ్‌సి వద్దకు చేరుకొని ఆమెను విధుల తొలగించాలని ఒత్తిడి చేశారు. సామ్రాజ్యంను డిఎంహెచ్‌ఒ విచారణ చేసే సమయంలోనే ఆమె వెంట తెచ్చుకున్న పురుగు మందును తానడంతో అక్కడున్న వారు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నా అప్పటికే పురుగుమందు నోట్లోకి వెళ్లటంతో హుటాహుటిన స్థానిక పిహెచ్‌సిలో తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం జిజిహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. గ్రామంలో నివాసం ఉండని సోమశేఖర్, అతని అనుచరుడు రామచంద్రయ్య వారి ఇంటికి వైద్యసేవలు అందట్లేదనే తప్పుడు ఫిర్యాదుతో సామ్రాజ్యంను తొలగించాలని ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు. వృత్తి పరంగా ఆమెపై ఎలాంటి లోపాలూ లేవన్నారు. కాగా రాజకీయ కారణాలతో ఆశా వర్కర్‌పై వేధింపులు సరికాదని, ఆమెపై ఒత్తిడి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు డిమాండ్ చేశారు.
వేధింపులకు కారకుల్ని శిక్షించాలి-సిఐటియు
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆశా వర్కర్‌కు మెరుగైన వైద్యం అందించి, అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దండా లక్ష్మీనారాయణ, వై.నేతాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్ సామ్రాజ్యంను సిఐటియు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే చిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయని అనుకుంటే జీవితాలే బుగ్గిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం, యానిమేటర్లు వంటి స్కీమ్ వర్కర్లపై, కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై అధికార కూటమి నిర్దాక్షిణ్యంగా వేధింపులకు పాల్పడుతోందన్నారు. తక్షణమే వేధింపులు ఆపాలని, వేధింపులకు పాల్పడిన నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించడం చేతకాని టిడిపి ప్రభుత్వం వేధింపులు పాల్పడటం సరికాదని హితవు పలికారు.
