ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : విజయనగరంలోని 16వ డివిజన్ లో జరిగిన వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు పాల్గొన్నారు. 19 నెంబర్ సచివాలయం నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయుక్తంగా ఉండే బోర్ వెల్ చెట్టు దిమ్మన ఏర్పాటు చేయాలని అలాగే పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. అంబటి సత్రం నుండి కొత్తపేట వెళ్లే రహదారిలో ప్రధాన కాలువకు మరమ్మతులు చేయాలని సూచించారు. అలాగే కొణిశి వీధికి వెళ్లే రహదారిలో ప్రధాన కాలువను కప్పివేసి సోఫాలు తయారీ కై అవసరమైన సామగ్రిని కాలువ పై ఉంచడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని, మధ్యాహ్నం భోజన పథకం అమలు ను పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు మాట్లాడుతూ .. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ పల్లి నల్లనయ్య సూచనలతో ప్రతి గురువారం వార్డు పర్యటనలు చేపడుతున్నామన్నారు. తమ పర్యటనలో గమనించిన క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. స్థానిక కార్పొరేటర్ గుజ్జల నారాయణరావు మాట్లాడుతూ తమ డివిజన్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టకి తీసుకువెళ్లామని, అవి పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా అధికారులు డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.