ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 565 జాతీ య రహదారిపై మాచర్ల మార్కాపురం రోడ్డులో వచ్చి పోయే వాహ నాలను ఆపి ఎస్‌ఐ పి.చౌడయ్య హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ చౌడయ్య మాట్లాడుతూ ఉరుకులు, పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతి చెందిన, గాయాలైన సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నామని చెప్పారు. అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
