ఎట్టబ్బ ఈ రోడ్డు దాటేది…!

Jan 16,2025 15:35 #Chittoor, #road

ప్రజాశక్తి – వెదురుకుప్పం ( చిత్తూరు జిల్లా) : గత సంవత్సరం డిసెంబర్ నెలలో కురిసిన వానలకు రోడ్లు పాడైపోయాయి. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో పాతగుంట పంచాయతీ పరిధిలో మొట్టి రెడ్డి కండ్రిగ దగ్గర రోడ్డు ధ్వంసం అయి  ఓ వాగు లా కోసుకోపోయింది. వాహనదారులు ఈ ప్రాంతానికి వచ్చారంటే అవతలకి దాటుకొని ఎలా వెళ్లాలి అని ఒక నిమిషం బండి ఆపి ఏ వైపు బాగా ఉందో చూసుకున్న తరువాత రోడ్డు  దాటుతున్నారంటేనే ఈ  రోడ్డు ఎంత అద్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్ల ద్వారా ప్రయాణం చేసేవారు అయితే ఇక క్రిందకు దిగి ఎక్కడ బండి చక్రాలు సాఫీగా ఎక్కుతాయో అని చూసుకుని ఆ వైపుగా ఎక్కించి ప్రయాణం సాగిస్తున్నారు. ఇంతకీ ఈ రహదారి ఎక్కడ అని ఆలోచిస్తున్నారా?  తిరుపతి వయా పచ్చికాపల్లం, పాత గుంట మీదుగా పెనుమూరు చిత్తూరుకి వెళ్లే ప్రధాన మార్గం లో ఉన్న రహదారి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు కార్లు, ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహదారులు, రైతులు తమ పంట పొలాలకు ఈ మార్గాలగుండానే తీసుకెళ్తుంటారు. ఇంత అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై మరో కొత్త రోడ్డును వేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు.

పత్తాలేని ఆర్ అండ్ బి అధికారులు
మండలంలో ఎక్కడైనా రహదారులు పాడైపోతే రోడ్డు రవాణా సంస్థ అధికారులు బాగు చేయాలి. అయితే వెదురుకుప్పం మండలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ సంస్థ అధికారులు వచ్చి చూసిన , బాగు చేసిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఎవరనేది కూడా తెలియదు. ఈ రోడ్డు సమస్యపై సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మంగమ్మ స్థానికురాలు

రోజు ఎంతోమంది పడిపోతారు… గాయాలతో వెళుతుంటారు
మొట్టిరెడ్డి కండిగ, దగ్గర ఉన్న రహదారి వంక లాగా కోసుకుపోయింది. ఇది పల్లం ప్రదేశం. చూసుకోకుండా స్పీడ్ గా వస్తే ఇక్కడకి వచ్చేసరికి ఆదుపుతప్పి పడిపోతుంటారు. వాహనదారులకు గాయాలవుతాయి. పండుగ రోజుల్లో ఈ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్పీడుగా వాహనదారులకు సంక్రాంతి పండుగ  సీజన్లో కాళ్లు చేతులు విరిగినవాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరికి చెప్పాలో తెలియదు. పట్టించుకునే వారు లేరు. మేము ఎదుర్కొంటున్న రోడ్డు సమస్య గురించి న్యూస్ పేపర్ వాళ్లయినా వార్త రాస్తే అప్పుడైనా అధికారులు చలించి మా సమస్యను తీరుస్తారని నేను అభిప్రాయపడుతున్ననాను.

లక్ష్మి స్థానికురాలు

➡️