గిన్నిస్‌ పోటీల ఎంట్రీఫీజు కోసం అథ్లెట్‌ వినతి

Nov 30,2024 00:36

ప్రజాశక్తి – వినుకొండ : ఫివ్రబరిలో లడక్‌లో 9 రోజులపాటు జరగనున్న ప్రతిష్టాత్మకమైన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ఎఎస్‌ఎఫ్‌ఎల్‌ రన్నింగ్‌ మారథాన్‌ పోటీల్లోనూ పాల్గొననున్నట్లు పట్టణానికి చెందిన అథ్లెట్‌ అబ్దుల్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికిముందు న్యూఢిల్లీలోని జవహల్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగే గ్రీన్‌ మారథాన్‌, 8న జైపూర్‌లో ఇండియన్‌ ఆర్మీ హానర్‌ రన్‌ ఆధ్వర్యంలో జరగనున్న పరుగు పందెంలో, 15న వైజాగ్‌ ఇండియన్‌ నేవీ మారధాన్‌ ఆధ్వర్యంలో జరగనున్న పరుగు పందెంలో తాను పాల్గొనబోతున్నట్లు పేర్కొన్నారు. ఆసియాలో మొదటి, ప్రపంచంలోనే అత్యధికంగా ఘనీభవించిన పాంగోగ్‌ సరస్సు ఉన్న ఎప్పుడు మైనస్‌ ఉష్ణోగ్రతలు ఉండే లడక్‌లో ఎముకలు కొరికే చలిలో 41 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు పరువు పందెంలో పాల్గొనే అవకాశం తనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన మారథాన్‌లో పాల్గొన్నప్పుడు ఇండియన్‌ ఎలైడ్‌ రన్నింగ్‌ మారధాన్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సునీత గోద్రా తనలోని ప్రతిభను గుర్తించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు రూ.70 వేలు చెల్లించాల్సి ఉందని, తనకు ఎవరైనా ఫీజు సాయం చేస్తే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

➡️