ఇసుక టెండర్ల వ్యవహారం వివాదాస్పదం కావడం విచారకరం. జిల్లాలో సాధారణంగా 13 నుంచి 16 ఇసుక రీచ్‌లు ఉన్నట్లు అంచనా. వేసవి సీజన్ కావడం, నదులు అడుగంటిన నేపథ్యంలో మరో మూడు రీచ్‌లకు మైనింగ్ జిల్లా అధికార యంత్రాంగం టెండర్లు పిలిచింది. నెల రోజుల కిందట తంగేడుపల్లి ఇసుకరీచ్‌కు టెండరు పిలిచింది. శుక్రవారం పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల పరిధిలోని గండికొవ్వూరు, రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల పరిధిలోని గుండ్లామూల ఇసుక రీచ్‌లకు జిల్లా మైనింగ్ యంత్రాంగం టెండర్లు పిలిచింది. గండికొవ్వూరు ఇసుక రీచ్‌కు పులివెందులకు చెందిన అధికార టిడిపి నేతల అనుచరులు పరస్పరం తీవ్రంగా పోటీ పడడంతో వ్యవహారం రచ్చకెక్కింది. ఇసుకను మార్కెట్ సరుకుగా మార్చడం దగ్గర నుంచి దాని నిర్వహణ దగ్గర వరకు ప్రభుత్వం స్వార్థపరత్వమే కారణమని తెలుస్తోంది. ఆర్‌డబ్య్లుఎస్ టెండర్ల దగ్గర నుంచి ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇటీవలి ఎక్సైజ్ విభాగం వరకు టెండర్లను ఆన్‌లైన్‌లో వేసుకుని అవకాశాన్ని కల్పించడం తెలిసిందే. మైనింగ్ టెండర్లను సైతం ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించి ఉంటే ఇటువంటి దౌర్జన్యకాండకు అవకాశం లేకుండా పోయేది. ప్రభుత్వ ఉద్దేశపూర్వక తప్పిదమే కారణమనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం టెండర్లను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. పాలనలో పారదర్శకత లభించడంతో పాటు జిల్లా అధికార యంత్రాంగానికి, సామాన్య ప్రజానీకానికి ఉపశమనం లభించే అవకాశం ఉంటుందని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లి, వేముల, పులివెందుల, లింగాల తదితర మండలాలకు చెందిన పలుగ్రామాల్లో రూ.కోట్లాది బెట్టింగ్‌తో కూడిన కోడిపందేలు జోరుగా సాగడం ఆందోళనకం. పోలీస్ యంత్రాంగం సంక్రాంతి పర్వదినానికి ముందు నుంచే కోడిపందేలు చట్టరీత్యా నేరమని ప్రచారం చేయడం వరకు బాగానే ఉంది. వాస్తవంలో కోడిపందేలు సాగిన మండలాలకు చెందిన పోలీస్ అధికారులపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో పోలీసుల ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. మూగజీవాల మధ్య బెట్టింగులతో కూడిన పందేలు పెట్టి చలిమంట కాచుకోవడం రాక్షసత్వం. ఇటువంటి రాక్షసత్వానికి ఒడిగట్టిన అసాంఘిక శక్తుల్ని అటుంచితే అందుకు పరోక్షంగా సహకరించిన బాధ్యత వహించిన సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో సామాన్యులను అటుంచితే అసాంఘిక, సంఘవిద్రోహ శక్తులకు పోలీసులన్నా, చట్టాలన్నా ప్రజలకు చులకనభావం ఏర్పడ డంతో పాటు గౌరవం, భయం పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి
