ఫైవ్‌స్టార్‌ ఫైనాన్స్‌ కంపెనీ సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : సిపిఎం

ప్రజాశక్తి-భట్టిప్రోలు : ఫైవ్‌స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ కంపెనీ సిబ్బంది వేధింపులకు బలైన పార్వతిబాయి కుటుంబాన్ని ఆదుకోవాలని, బాధ్యులపై ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి కంపెనీ ద్వారా రూ. 25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. గత రెండు రోజుల క్రితం భట్టిప్రోలు మండలం వెల్లటూరు చెన్నకేశవ కాలనీలో ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాణావతి పార్వతి బాయి కుటుంబ సభ్యులను సిపిఎం బందం గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి. కష్ణమోహన్‌, భట్టిప్రోలు మండల కార్యదర్శి జి. సుధాకర్‌ ఎదుట మృతిరాలి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఫైవ్‌స్టార్‌ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ సిబ్బంది గతేడాది పార్వతి బాయి ఇంటిని తాకట్టు పెట్టుకొని రూ.3 లక్షల ఇస్తామని చెప్పారన్నారు. చివరకు రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. అప్పటి నుంచి పార్వతిబాయి అధిక వడ్డీతో కిస్తీలు కడుతున్నట్లు తెలిపారు. ఒకటి, రెండు సందర్భాల్లో డబ్బులు లేని నేపథ్యంలో కంపెనీ వాళ్ళు పార్వతిబాయిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు పేర్కొన్నారు. గతేడాది ఓ సారి డబ్బులు లేవని చెప్పడంతో కంపెనీ సిబ్బంది పార్వతిబాయిపై భౌతికంగా దాడి చేయడంతో ఆమె వేలు విరిగిపోవడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందినట్లు తెలిపారు. డబ్బులు కట్టలేదని ఇంట్లోని ఫ్రిజ్‌, సామ్రగిని తీసుకెళ్లినట్లు తెలిపారు. మొత్తం బాకీ ఎంత చెల్లించాలని అడిగితే రెండు లక్షలకు ఏడు సంవత్సరాలు పాటు మొత్తం ఆరు లక్షలకు పైగా కట్టాలని కంపెనీ వారు చెప్పారన్నారు. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి డబ్బులు కట్టాలని డిమాండ్‌ చేస్తూ పార్వతి బాయిపై భౌతిక దాడి చేసి ఇంట్లోని సామాన్లు బయట పడవేసినట్లు తెలిపారు. దీంతో అవమానం భరించలేక పార్వతిబాయి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ డబ్బులు కట్టకపోతే కోర్టు ద్వారా చూసుకోవాలే తప్ప భౌతికంగా దాడి చేయడం దారుణమన్నారు. భట్టిప్రోలు మండలంలోనే కాక ,జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఫైవ్‌ స్టార్‌ కంపెనీ బాధితులు చాలామంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. పార్వతి బాయి కేసు విషయంలో రెవెన్యూ, పోలీస్‌ అధికారులు బాధిత కుంటుబానికి న్యాయం జరిగే విధంగా వ్యవహరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఫైవ్‌ స్టార్‌ కంపెనీ సిబ్బందిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి. వెంకటరామయ్య, పి. మనోజ్‌ ,ఎం. సత్యనారాయణ ,జి.నాగరాజు పాల్గొన్నారు.

➡️