ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు

Apr 11,2025 16:34 #in Vizianagaram, #plastic

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నగరంలో నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ప్రజారోగ్య సిబ్బంది 1,110 కేజీల ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, తన బృందంతో కలిసి నగరంలో వివిధ ప్రాంతాలలో ప్లాస్టిక్ విక్రయ దుకాణాల పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం పి.డబ్ల్యు.మార్కెట్ లో ఉన్న ప్లాస్టిక్ దుకాణాల వద్దకు వెళ్లి నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలను గుర్తించి మొత్తం 1,110 కేజీల ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకొని మధురవాడ లో ఉన్న జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు తరలించి వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో తామ కృషి చేస్తున్నప్పటికీ కొందరు వ్యాపారస్తులు అనధికారికంగా ప్లాస్టిక్ విక్రయాలను సాగిస్తున్నారన్నారు. ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేస్తూ ప్లాస్టిక్ ను విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్నారన్నారు. ఇక నుండి నిరంతరం దాడులు నిర్వహించి ప్లాస్టిక్ అమ్మకాలను నియంత్రిస్తామన్నారు. ప్రతిరోజు ప్లాస్టిక్ వినిమయం జరగకుండా పూలు,కూరగాయల దుకాణాలు ఇతరత్రా చిన్నచిన్న దుకాణాల వద్దకు వెళ్లి తమ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారన్నారు. అయితే కొంతమంది నిబంధనలను అతిక్రమించి ప్లాస్టిక్ అమ్మకాలు సాగించడంతో నగరంలో ప్లాస్టిక్ వినీమియం జరుగుతున్నట్లుగా గుర్తించామన్నారు. దీంతో ఆకస్మిక దాడులు చేపట్టాలని ఆదేశించడంతో 1,110 కేజీల నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకొని, ఎనర్జీ ప్లాంట్ కు తరలించామన్నారు. ఇక నుండి ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్ ను విక్రయించినట్లు గుర్తిస్తే అటువంటి సరుకును స్వాధీనం చేసుకోవడంతో పాటు, భారీ అపరాధ రుసుములను విధించి,దుకాణాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలకు కూడా చేపడుతామని హెచ్చరించారు. ఈ ఆకస్మిక దాడుల్లో పారిశుధ్య పర్యవేక్షకులు బాలకృష్ణ, అంజిబాబు,రవి శేఖర్, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

➡️