ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆటో కార్మికులంతా కలిసి ఎమ్మెల్యేకు బుధవారం వినతి చేశారు. ” విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 1997 సంవత్సరం నుండి ఆటో యూనియన్ ఏర్పడింది. అనేక సార్లు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని యూనియన్ పద్ధతిలో అనేక ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకులు, కలెక్టరేటు ఎదుట మున్సిపల్ ఆఫీసు ఎదుట, ఆర్.టి.ఓ. ఆఫీసు ఎదుట పోరాటాలు చేస్తే ఎట్టకేలకు 2007లో ఆర్.టి.ఓ. మున్సిపల్ కమిషనర్ పోలీసు అధికారులు ఉమ్మడిగా సర్వేజరిపి, పార్కింగ్ స్థలాలను కేటాయించారు. అప్పటి నుండి క్రమశిక్షణగా సీరియల్ పద్దతిలో ఈరోజు వరకు నడుచుకుంటున్నాం. గత రెండు నెలల నుండి ట్రాఫిక్ పోలీసు వారు మీకు ఎక్కడ కూడా ఆటో స్టాండులు అనేవి లేవు, ఆటో స్టాండులు కేటాయించే అధికారం ఎవ్వరికీ లేదని ప్రతిరోజు నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. మా పై అధికారులు కాన్వన్ వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉందని పదేపదే మాతో వాదిస్తున్నారు. అందుకే ఆటోలు స్టాండులలో పెట్టవద్దని అంటున్నారు. ఆటోస్టాండులు వలన ట్రాఫిక్ అంతరాయం లేదని చెప్పినప్పటికి ట్రాఫిక్ పోలీసు వారు ఒప్పుకోవడం లేదు. ఆర్.టి.సి. కాంప్లెక్స్లోలో ప్రయాణీకులు రద్దీగా ఉంటారు. ఆటోలలో వచ్చిన వారు, బైకై వచ్చిన వారు, కార్లులలో వచ్చిన వారు అందరూ అక్కడికి చేరుకోవడం వలన ప్రతినిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ వారు ట్రాఫిక్ కంట్రోల్ ఖచ్చితంగా చేస్తే ఎవరికి అంతరాయం ఉండదని తెలియజేస్తున్నాం. అదే విధంగా ఆటోస్టాండులలో ఆటోలను తొలగించడం చలన షాపుల యాజమానులు అనుకూలంగా ఉంటుంది. కావున తమరు పై విషయాన్ని పరిశీలించి ఆటోస్టాండులను యదావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోగలరు ” అని విజయనగరం ఎమ్మెల్యేను కలిసిన ఆటో కార్మికులు కోరారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందించిన వారిలో విజయదుర్గా ఆటో వర్కర్లు యూనియన్ అధ్యక్షులు రెడ్డి నారాయణరావు, అప్పలరాజు,సన్యాసిరావు,ధర్మారావు,రాము వందల సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు.
