అవణి డిపాజిట్‌ పథకం ఉపయుక్తం : డిసిసిబి ఎజిఎం

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ అవణి డిపాజిట్‌ పథకం సీనియర్‌ సిటిజన్స్‌కు ఎంతో ఉపయుక్త మని, సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌ ఎజియం చంద్రకళ తెలిపారు. ఆదివారం స్థానిక జిఆర్‌టి హైస్కూల్‌లో జరిగిన సమావేశంలో ఎజియం మాట్లాడుతూ చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సీనియర్‌ సిటిజన్‌ మహిళలకు 8.4శాతం వడ్డీ వస్తుందన్నారు. కరపత్రాలు విడుదల చేసి పథకం గురించి అవగాహన కల్పించారు. 333 రోజులకు అవణి డిపాజిట్‌ పథకం 8.30 శాతం వడ్డీతో మహిళలు ఉపయోగించు కోవడానికి ఈనెల 31వ వరకు మాత్రమే అవకాశం ఉందని అన్నారు. ఇందులో కనిష్ట డిపాజిట్‌ రూ.10 వేలకు పైబడి స్వీకరించబడునని చెప్పారు. మీ డిపాజిట్లకు డిఐసిజిసి ఇన్సూరెన్స్‌ రక్షణ కలదని వివరించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పొదుపు చేస్తే వాణిజ్య బ్యాంకుల కంటే అదనపు వడ్డీ పొందవచ్చునని పేర్కొన్నారు. విశ్రాంత బ్యాంక్‌ మేనేజరును గొల్లపూడి తిరుపతి రావు మాట్లాడుతూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో డిపాజిట్‌ చేసి అత్యధిక వడ్డీని పొందవచ్చునని అన్నారు. ముఖ్యంగా అవణి డిపాజిట్‌ పథకం క్రింద డిపాజిట్‌ చేయడం వలన సీనియర్‌ సిటీజన్లు అధిక ప్రయోజనం పొంద వచ్చునని సూచించారు. ఈ అవకాశాన్ని ఆసక్తి వున్న వారందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంక్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ వాణి, సీనియర్‌ సిటీజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎన్‌.మునిగోపాలకష్ణ, రాయల్‌ యూత్‌ సొసైటీ వ్యవస్థాపకులు రేగడి ప్రసాద్‌ కుమార్‌, ధనలక్ష్మి, అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️