కుటుంబ నియంత్రణపై గిరిజనుల్లో అవగాహన

గిరిజనులు, వైద్య సిబ్బందితో కలిసి భోజనం చేస్తున్న సబ్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి, ఎఎస్‌పి ప్రతాప్‌ శివ కిశోర్‌

ప్రజాశక్తి-సీలేరు

కుటుంబ నియంత్రణ పద్ధతుల పాటించకుండా అధిక సంతానం కలిగి ఉండటం వివిధ సమస్యలకు దారితీస్తుందని, అందువల్ల కుటుంబ నియంత్రణపై గిరిజనుల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పాడేరు సబ్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి, చింతపల్లి సబ్‌ డివిజన్‌ ఎఎస్‌పి ప్రతాప్‌ శివ కిశోర్‌ అన్నారు. జీకే వీధి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సేతు కార్యక్రమంలో భాగంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌, ఎఎస్‌పి మాట్లాడుతూ కుటుంబ నియంత్రణపై అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి తల్లులు, పిల్లలు బలహీనపడి రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎక్కువమంది పిల్లలను కనడం వలన అంగవైకల్యంతో పుడుతున్నారన్నారు. అధిక కాన్పులు జరుగుతుండడం వల్ల మాతా శిశు మరణాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల వారికి సరైన పోషకాహారం, చదువు, మంచి భవిష్యత్తు అందించలేక అనేక రకాలైన సామాజిక ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ స్త్రీలకు చేయాలంటే పెద్ద ప్రొసీజర్‌తో కూడిన అంశమని, పురుషులకు అయితే చాలా సులభమని, 10 నిమిషాల్లో చిన్నపాటి సర్జరీ ద్వారా ఆపరేషన్‌ పూర్తయి వెంటనే వారు కోల్కుంటారని తెలిపారు. ఎటువంటి అనారోగ్యపరమైన సమస్యలు ఉండవని, మొదటి రోజు నుండే ఏ పనినైనా సులభతరంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న వారికి ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్‌లో రూ.1100 జమ చేస్తుందన్నారు. ఒకవేళ ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరికైనా తలెత్తితే వారికి రూ.33వేలు వరకు ఇన్సూరెన్స్‌ ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. అందువల్ల ప్రజలను చైతన్యవంతులు చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. సేతు కార్యక్రమంలో భాగంగా 130 మంది కుటుంబ నియంత్రణ చికిత్సలకు హాజరైనట్లు తెలిపారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి పోలీసులు భోజనం సౌకర్యాలు కల్పించారు. పాడేరు జిల్లా ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణారావు. దారకొండ, జికె.వీధి, లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్‌ హిమబిందు, డాక్టర్‌ అచ్యుతరావు, డాక్టర్‌ లక్ష్మీకాంత్‌, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై ప్రజలకు క్లుప్తంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జికె.వీధి సిఐలు అప్పలనాయుడు, అశోక్‌ కుమార్‌, ఎస్‌ఐ కె.అప్పలసూరి, పోలీస్‌, వైద్య సిబ్బంది, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

➡️