మానవీయ విలువలపై అవగాహన

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం

ప్రజాశక్తి -మధురవాడ : విద్యార్ధులకు కోర్సులకు సంబంధించిన అంశాలతో పాటు విశ్వజనీనమైన మానవతా విలువలను, ప్రస్తుత సమాజంలో వాటి ప్రాధాన్యతను తెలియజెప్పాల్సిన అవసరం ఉందని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ప్రో వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై. గౌతమ్‌రావు అన్నారు. బుధవారం గీతంతో పాటు నగరంలోని వివిధ కళాశాల అధ్యాపకులకు ‘విశ్వజనీనమైన మానవత విలువలతో కూడిన విద్యాబోధన’ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆచార్య గౌతంరావు మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో యువతరంపై ముఖ్యంగా విద్యార్థులలో సమాజం పట్ల బాధ్యత, వృత్తి విలువలు పాటించడం, జీవితంలో ఉన్నత వ్యక్తిత్వంతో ఎదగడం వంటివి అధ్యాపకులే మార్గదర్శకం చేయాలని సూచించారు. నూతన విద్యా విధానంలో భాగంగా సైన్స్‌, ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులను అభ్యసించే విద్యార్ధులకు మానవతా విలువలను బోధించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. డాక్టర్‌ పివి. లక్ష్మి సమన్వయపరిచిన కార్యక్రమంలో నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ నిపుణులు ఉమేష్‌ జాదవ్‌, డాక్టర్‌ జగదీష్‌బాబు, డాక్టర్‌ శ్రీజ మధు పాల్గొన్నారు.

➡️