పిఎం సూర్య ఘర్‌ యోజనపై అవగాహన

Nov 29,2024 00:57 #PM Surya Ghar avagahana
PM Surya Ghar avagahana

 ప్రజాశక్తి-ఆనందపురం : ఆనందపురం మండల కార్యాలయంలో గురువారం పిఎం సూర్య ఘర్‌ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, 40 గిగా బైట్ల సౌర విద్యుదుత్పత్తి కోసం రూ.60 వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. సౌర విద్యుత్తు వల్ల ప్రకృతికి నష్టం వాటిళ్లదని, విద్యుత్తు బిల్లులు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. ప్రతి ఇంటి రూఫ్‌ టాప్‌ మీద 1 కిలో వాట్‌ కు రూ.30 వేలు, 2 కిలో వాట్లకు రూ.60 వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు చొప్పున ప్రభుత్వ రాయితీ లభిస్తుందని, మిగతా సొమ్ము బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు రుణాలుగా సమకూరుస్తాయని వివరించారు. జిల్లాలో ఎంపిక చేసిన ఆనందపురం, రెడ్డిపల్లి, చిప్పాడ, వెల్లంకి, ఆర్‌. తాళ్లవలస, గంభీరం గ్రామాలన్నీ భీమిలి నియోజకవర్గంలోనివి కావడం సంతోషకరమన్నారు. వీటిలో పూర్తి సౌర విద్యుత్తు వాడే గ్రామాన్ని ఎంపిక చేసి రూ.కోటి ప్రోత్సాహకం కింద అందిస్తామని తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో అన్నవరం గ్రామాన్ని గతంలో సౌర విద్యుత్తు గ్రామంగా మార్చామని గుర్తు చేశారు. విద్యుత్తు వినియోగం అనేక రెట్లు పెరిగిందని, దానికి తగ్గట్టు ఉత్పత్తి కూడా పెరగాలనే ఆలోచనతో పిఎం సూర్య ఘర్‌ యోజన పథకాన్ని రూపకల్పన చేశారన్నారు. జిల్లా కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేయని సౌర శక్తి వాడకాన్ని ప్రజలంతా అలవాటుగా చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సౌర శక్తి వినియోగం ప్రచార పోస్టర్‌ను గంటా శ్రీనివాసరావు తదితరులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ సంగీత్‌ మాధుర్‌, ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ శ్యాంబాబు, డిఆర్‌డిఎ పీడీ లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఎంపిడిఒలు జానకి, విజరుకుమార్‌, హనుమంతరావు, కూటమి నాయకులు కోరాడ రాజబాబు, డిఎఎన్‌.రాజు, కె.రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️