ప్రజాశక్తి -మార్కాపురం రూరల్ :మాట్లాడుతున్న ఉప కలెక్టర్ రాహుల్ మీనా అర్హత కలిగిన ప్రతి కౌలురైతు కౌలు గుర్తింపు కార్డులు పొందాలని ఉప కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూశాఖల సంయుక్త ఆధ్వర్యంలో క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డుల జారీ ప్రక్రియపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ 11నెలల కాలవ్యవధితో కూడిన సిసిఆర్‌సి కార్డులు కలిగిన కౌలుదారులకు రైతుభరోసా వర్తిస్తుందన్నారు. ఈక్రాప్ నమోదుచేయించుకుని పంటనష్టం జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందవచ్చునని చెప్పారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో గ్రామాల్లో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి కౌలు రైతులను గుర్తించి కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిఎ బాలాజీ నాయక్, ఎఒ దేవిరెడ్డి శ్రీనివాసులు, డిటీ శ్రీనివాసులు, విఆర్‌ఒలు, విఎఎలు తదితరులు పాల్గొన్నారు.గిద్దలూరు రూరల్ : స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు సిద్థార్ద, ఎఒ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో కౌలు రైతు కార్డుల జారీపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ సిసిఆర్‌సి చట్టం ప్రకారం మండలం లోని ప్రతి కౌలు రైతుకు తప్పనిసరిగా కౌలు కార్డు ఇవ్వాలని సూచించారు. గిద్దలూరు మండలంలో 1461 సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి అర్హులకు కౌలు రైతు కార్డులు ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు సుబ్బారావు, ఆర్‌ఐ, వ్యవసాయ విస్తరణ అధికారి,గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ సహాయకులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల : పంట సాగు, హక్కు పత్రాలపై గ్రామ రెవెన్యూ అధికారులకు, గ్రామ వ్యవసాయ సహాయకులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు ఎస్‌ఎం.హమ్మద్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పంట సాగు, పత్రాల గురించి రైతులకు అవగాహనా కల్పించారు. ఎస్‌సి,ఎస్‌టి సన్న, చిన్న కారు రైతులను గుర్తించి పత్రాలను మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఒ డి.జవహర్‌లాల్ నాయక్, ఆర్‌ఐ నాగేశ్వరరావు, విఆర్‌ఒలు గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యన సహాయకులు, పట్టు సహాయకులు పాల్గొన్నారు. జరుగుమల్లి : కౌలు రైతులకు భూమిపై ఎలాంటి హక్కులు ఉండవని కేవలం పండించే పంట మీదే హక్కు ఉంటుందని తహశీల్దారు చక్రవర్తి తెలిపారు. రెవెన్యూ శాఖ, వ్వవసాయ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు పంట సాగు పత్రాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఒ యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ విఆర్‌ఒ, విఎఎ, విహెచ్‌ఎలు నిజమైన కౌలు రైతులను గుర్తించి సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేయాలన్నారు.
