ఉప్పు సత్యాగ్రహంపై విద్యార్థులకు అవగాహన

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలలో ఉప్పు సత్యాగ్రహం గురించి బిఏ చదువుతున్న విద్యార్థులు బుధవారం నాటక రూపంలో ప్రదర్శించారు. 1930 మార్చి 12వ అహమ్మదాబాద్‌లోని శబర్‌మతి ఆశ్రమంలో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం గురించి ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి శ్రీధర్‌నాయుడు, డాక్టర్‌ పి ప్రదీప్‌ మాట్లాడుతూ ఉప్పుపై ఆంగ్లేయ ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్రోద్యమ కాలంలో చేపట్టిన మహోజ్వలమైన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నుంచి 1930వ సంవత్సరం మార్చి 12వ తేదీన మహాత్మాగాంధీ దండియాత్రను ప్రారంభించారు. గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు, ఇది కోట్లాది భారతీయులు బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చింది. గుజరాత్‌ సముద్రం తీరం వెంబడి 400 కిమీల పాటు సాగిన మహాత్ముని యాత్ర 1930వ సంవత్సం ఏప్రిల్‌ ఆరో తేదీన దండిని చేరుకుంది. అక్కడే, మహాత్ముని సమక్షంలో వేలాదిగా ప్రజలు చట్టవిరుద్ధంగా సముద్ర జలాల నుంచి సొంతంగా ఉప్పును తయారు చేశారు. చట్టాలను ఉల్లంఘించి గాంధీజీ అరెస్టయ్యారు. ఈ ఉద్యమంలో భాగంగా మద్యపానశాలలు, విదేశీ వస్త్ర దుకాణాల ముందు ధర్నా, రాస్తారోకో వంటి నిరసన కార్యక్రమాలు అహింసాయుతంగా నిర్వహించారు. గాంధీజీ పిలుపుతో దేశం నలువైపుల నుంచీ ఉద్యమ నాయకుడి సారథ్యంలో ప్రజలు నిరసనలు తెలిపారు. అస్సాంలోని సిల్హెట్‌, బెంగాల్‌లోని నౌఖాలీ, మద్రాస్‌ రాష్ట్రంలోని మద్రాస్‌, ఆంధ్ర, కేరళలోని కాలికట్‌, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌, నేటి పాకిస్తాన్‌లోని (ఆనాటి భారత్‌) పెషావర్‌ తదితర ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం వివిధ రూపాల్లో జరిగింది. గహర్వాల్‌ ప్రాంతంలో ప్రజలపై కాల్పులు జరపడానికి సైనికులు నిరాకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో వస్త్ర పరిశ్రమ కార్మికులు సమ్మెకు దిగారు. ‘ఎత్తిన జెండా దించని’ ఉద్యమం కూడా ఇందులో భాగంగా ప్రారంభమైంది. తోట నర్సయ్య నాయుడు ఆంధ్రలో ఎత్తిన జెండా దించని స్వాతంత్య్రయోధుడిగా కీర్తిపొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️