ప్రజాశక్తి-బొబ్బిలి : తమ కుటుంబం 16 తరాల నుంచి ఆయుధ పూజ చేస్తున్నట్లు బొబ్బిలి రాజ వంశీయులు సుజయకృష్ణ రంగారావు, బేబినాయన తెలిపారు. దసరా సందర్భంగా శుక్రవారం బొబ్బిలి కోటలో అంగరంగ వైభవంగా ఆయుధపూజ చేశారు. రాజుల పరిపాలనలో వినియోగించిన బంగారు సింహాసనాన్ని కోటలో తమ నివాసం నుంచి దర్బార్‌మహల్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సింహాసనానికి, యుద్ధంలో వినియోగించిన ఆయుధాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆయుధ పూజ చేస్తున్నామని చెప్పారు. ఆయుధ పూజను డిఎస్‌పి శ్రీనివాసరావు, పట్టణ, రూరల్ సిఐలు సతీష్ కుమార్, నారాయణరావు, నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు హాజరై తిలకించారు.
