ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని అయ్యప్పగారిపల్లి గ్రామం, గుట్టమీద దళితవాడకు చెందిన రంగాల వెంకటరమణ, లక్ష్మి దంపతులకు రెండవ కుమారుడు సూర్యనారాయణ(25) మదనపల్లె ఎన్‌టిఆర్ సర్కిల్ వద్ద ఓ ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. డి.జయన్న 19 ఏళ్ల కుమార్తెను ప్రేమిస్తున్నట్లు తెలుసుకొని ఇటీవల సూర్య నారాయణను మందలించినట్లు తెలిసింది. అయితే అతను తన తీరు మార్చుకోకుండా ఆ యువతిని ప్రేమిస్తూ ఉండడంతో ఆగ్రహించిన ఆమె తల్లిదండ్రులు ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో దారి కాసి మదనపల్లె నుండి ఇంటికి వెళుతున్న సూర్యనారాయణను అడ్డగించి కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడి ఇంటికి వచ్చిన సూర్య నారాయణ తనకు జరిగిన అవమానం, కొట్టిన దెబ్బల విషయం తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయాడు. మనసులోనే మదన పడుతూ ఇంట్లో పడుకున్న సూర్యనారాయణ తెల్లవారిసరికే కన్నుమూశాడు. బిడ్డ ఉన్నపలంగా చనిపోవడంతో ఆరా తీసిన తల్లిదండ్రులకు అసలు విషయం వెలుగు చూసింది. అదే గ్రామానికి చెందిన పల్లవి తండ్రి జయన్న, అతని అన్న అమర్నాథ్ సూర్యనారాయణను దారుణంగా కొట్టడం వల్లనే చనిపోయాడని గుర్తించారు. కుటుంబ సభ్యులు బంధువులతో వెళ్లి బి.కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సలహా మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి సర్వజన బోధనాసుపత్రిలోని తరలించారు. తన బిడ్డను అన్యాయంగా కొట్టి చంపారని మృతుడు సూర్యనారాయణ తండ్రి వెంకటరమణ ఆరోపిస్తున్నాడు. కొట్టి చంపడం వల్ల సూర్యనారాయణ చనిపోయాడా.. లేక ఇతర కారణాలతో చనిపోయాడా అన్నది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తేలాల్సి ఉందని బి.కొత్తకోట సిఐ రాజారెడ్డి తెలిపారు.