టిడిపిలో వెన్నుపోట్లు!

ప్రజాశక్తి – కడప ప్రతినిధి ప్రతిపక్ష టిడిపి అభ్యర్థులకు వెన్నుపోట్లు తప్పలేదు. జిల్లాలోని కడప, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు పార్టీకి చెందిన కొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడం గమనార్హం. పోలింగ్‌ ముందు అసమ్మతి నేతలందరూ కలిసికట్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఏంజరిగిందో అభ్యర్థికి, అసమ్మతి నాయకులకు తెలియాలి. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజే వెన్నుపోటు పొడిచారనే ఆరోపణలు చేయడం, వెన్నపోటుదారులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారో తెలియని అసమ్మతి నేతలు సైతం గుంభనంగా వ్యవహరించడం గమనార్హం. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌. శ్రీనివాసులరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీరితో ఎన్నికల నోటిఫికేషన్‌ దగ్గర నుంచి కలవని నేతలను ఉద్దేశించి చేశారా లేక ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియడం లేదు. ఆ మరుసటిరోజే కమలాపురం అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి నేరుగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఉంటూనే కోగటంలోని తమ ఏజెంట్లను హెచ్చరించడం, బెదిరించడం వంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమేమిటని విమర్శించడం గమనార్హం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ అభ్యర్థుల ఆరోపణలపై అసమ్మతి నేతల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం.

➡️