ఉపాధి కల్పనలో వెనుకబాటు

Mar 18,2025 21:36

 లక్ష్యం చేరుకోని పనిదినాలు

పనులు దొరక్క అవస్థలు పడుతున్న కూలీలు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఉపాధి కల్పనలో విజయనగరం జిల్లా వెనుక బడడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి. ఏటా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా తాజాగా రెండో స్థానంలో నిలిచింది. కనీసం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పనులు దొరక్క కూలీలు అవస్థలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వీరి వెతలు వర్ణణాతీతం. కమ్యూనిస్టుల ఒత్తిడితో 2024లోని యుపిఎ-1 మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ఏటా వంద రోజులు పని గ్యారెంటీగా కల్పించాలి. 14రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. సకాలంలో పని కల్పించకపోతే నష్టపరిహారం చెల్లించాలి. చెల్లింపుల్లో జాప్యం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ చట్టంలో అత్యంత కీలకమైన ఈ రెండూ అమలు కావడం లేదు. జిల్లాలో ఉపాధి గ్యారెంటీ జాబ్‌ కార్డులు 3.84లక్షల వరకు ప్రభుత్వం జారీ చేసింది. వీటి పరిధిలో 6.84మంది కూలీలు పనులు చేస్తున్నారు. ఇందులో 3.53 జాబ్‌కార్డుల ద్వారా 5.94 మంది కూలీలు పూర్తిగా ఈ ఉపాధి హామీ పనుల ఆధారంగానే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇందులో సుమారు 54వేల వరకు దళిత, గిరిజన కుటుంబాలు కాగా, మిగిలినవారంతా భూమి లేని ఇతర సామాజికవర్గాలకు చెందినవారు ఉన్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో అత్యధిక కుటుంబాలవారికి ఉపాధి పనులే జీవనాధారం అని వేరేగా చెప్పునక్కర్లేదు. ఈనేపథ్యంలోనే ఉపాధి పనులు వినియోగించు కోవడంలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉంటోంది. తద్వారా పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ జిల్లా కలెక్టర్లు, డ్వామా అధికారులు ఎన్నో అవార్డులు, రివార్డులు ఢిల్లీ స్థాయిలో అందుకున్నారు. ఈఏడాది 1.81కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 1.70కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించినట్టు సాక్షాత్తు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన 11కోట్ల పనిదినాల కల్పనకు ఈనెల 31వరకు మాత్రమే సమయం ఉంది. గడిచిన రెండేళ్ల పరిస్థితి ఒక్కసారి పరిశీలిస్తే 2023-24లో 2.10కోట్ల పనిదినాలు లక్ష్యం పెట్టుకోగా 2.18కోట్ల పనిదినాలు కల్పించారు. 2022-23లో 1.86కోట్ల పనిదినాలకుగాను 1.95కోట్ల పనిదినాలు కల్పించారు. అంతకు ముందు పథకం అమల్లోకి వచ్చింది మొదలు ఏటా ఎంతో కొంత లక్ష్యానికి మించే పని దినాలు కల్పించినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా గ్రామాల్లో పనులు దొరక్క కూలీలు అవస్థలు పడుతున్నారు. వంద రోజులు పనిచేయనివారు జిల్లాలో ఇంకా సగం మంది కూలీలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

➡️