బడిదేవరకొండ క్వారీ పనులు ఆపాలి

Oct 11,2024 19:48

 గ్రానైట్‌ లీజు లైసెన్స్‌ రద్దు చేయాలి

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ :  గిరిజనులు, ప్రజలు అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా బడిదేవరకొండ క్వారీ యాజమాన్యం చేపట్టిన గ్రానైట్‌ తవ్వకాలను వెంటనే ఆపాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన సంఘం నాయకులు పి.రాముతో కలిసి మాట్లాడారు. క్వారీ పనులను ఆపకపోతే రానున్న రోజుల్లో గ్రానైట్‌ యాజమాన్యం తీవ్రమైన ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజలు, రైతులు, గిరిజనుల గోడు యాజమాన్యానికి ఎలాగూ పట్టదని, కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. క్వారీ పనులు ఆపాలని ప్రజలు, గిరిజనులు, రైతులు అనేక దఫాలుగా జిల్లా యంత్రాంగానికి, పాలక ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నా పెడచెవిన పెట్టడం, కార్పొరేట్లకు కొమ్ముకాయడం బాధాకరమని అన్నారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తామని చంద్రబాబు ఎన్నికల సభల్లో వాగ్దానం చేశారని, అయితే అందుకు భిన్నంగా నేడు చాప కింద నీరులా కొండలు, గనుల తవ్వకాలకు, అక్రమ మైనింగ్‌ తరలింపులకు అనుమతులు ఇస్తుండడం దౌర్జన్యకరమైన చర్యని వాపోయారు. పార్వతీపురం మండలంలోని ములగ గ్రామంలో గల బడిదేవరకొండకు 2017లో గ్రానైట్‌ తవ్వకాలకు అప్పటి ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తే కొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉందని, దానికి అనుమతులు ఇవ్వడం సరైనది కాదని అప్పటి ఫారెస్ట్‌ అధికారులు ధ్రువీకరణ ఇచ్చారని, దీనికి అనుగుణంగా కొండపై గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పోడు పట్టాలు కూడా అందించారని గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం అదే బడిదేవరకొండ గ్రానైట్‌ మైనింగ్‌ లీజు లైసెన్సులు మంజూరు చేస్తూ, పట్టాలు రద్దు చేయడం సరైంది కాదన్నారు. ఈ కొండ రెవెన్యూ, ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్లు ఉమ్మడి సర్వేలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ అని తేలిన తర్వాతే 2017లో ఇచ్చిన లీజ్‌ లైసెన్సు రద్దు చేశారని అన్నారు. నేడు మరల ప్రభుత్వాలు కార్పొరేట్‌ శక్తులతో కుమ్మక్కై కొండ తవ్వకాలకు తారుమారుగా సర్వేలు చేపట్టి రికార్డులను తిరగ రాయడం అన్యాయమని అన్నారు. నాడు లైసెన్స్‌ అనుమతుల రద్దులో గిరిజన పోరాటం బడిదేవరకొండ చరిత్రలో నిలిచిందని, నేడు మరల తవ్వకాల పనులు చేపడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

➡️