ఇసుక టెండర్లలో బాహాబాహీ

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలోని ఇసుకరీచ్‌ల టెండర్ల దాఖలు వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. గురువారం జిల్లా గనులశాఖ అధికార యంత్రాంగం కోర్టు పరిధిలో ఉన్న పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట మండలంలోని గండికొవ్వూరు, రాజంపేట నియోజకవర్గ సిద్ధవటం మండల పరిధిలోని గుండ్లామూల ఇసుక రీచ్‌లకు ఆఫ్‌లైన్‌లో టెండర్లు పిలిచింది. ఇసుక రీచ్‌ల టెండర్లలో పాల్గొనేందుకు పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ అనుచరులు, సిద్ధవటం మండల పరిధిలోని గుండ్లామూల ఇసుక రీచ్‌ టెండరు దాఖలు చేయడానికి కడప, కమలాపురం ఎమ్మెల్యేల అనుచరుల పేరుతో పలువురు టెండర్లు దాఖలుకు హాజరయ్యారు. చక్రాయపేట మండలం గండికొవ్వూరు రీచ్‌కు టెండరు దాఖలు చేయడంలో మాజీ ఎమ్మెల్సీ బి.టెక్‌ రవి అనుచరులు పెద్దఎత్తున టెండర్లు గదిని ఆక్రమించుకుని మూత వేయడానికి ప్రయత్నం చేశారు. సిద్ధవటం మండలానికి చెందిన గుండ్లామూల ఇసుక రీచ్‌ టెండరు దాఖలు చేయడానికి సైతం కడప, కమలాపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధుల, సిద్ధవటం మండలానికి చెందిన జనసేన నాయకులు, ఆయన అనుచరులు పెద్దఎత్తున హాజరు కావడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇసుకరీచ్‌ల టెండర్ల దాఖలు వ్యవహారం దాదాపుగా స్తంభించింది. మధ్యాహ్నానంతరం పోలీసులు రంగప్రవేశం చేయడంతో వ్యవహారం కొలిక్కి వచ్చింది. పోలీసుల జోక్యం చేసుకోవడంతో టెండర్లు దాఖలుదారులను మినహా మిగిలిన అనుచరులను చెదరగొట్టడం, గనుల శాఖలోనికి అనుమతించకపోవడంతో టెండర్ల వ్యవహారం ప్రశాంతంగా నిర్వహించడం జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గండి కొవ్వూరు ఇసుక రీచ్‌కు 2, గుండ్లామూల ఇసుక రీచ్‌కు 14 టెండర్లు దాఖలు కావడం గమనార్హం. కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం తదుపరి షెడ్యూలు ప్రకారం వెళ్తామని గనులశాఖ డిడి పేర్కొనడం గమనార్హం.

➡️