- టిడిపి ప్రజాప్రతినిధుల అనుచరుల హల్‌చల్
ప్రజాశక్తి – కడప ప్రతినిధి : కడప జిల్లాలోని ఇసుకరీచ్‌ల టెండర్ల దాఖలు వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట మండలంలోని గండికొవ్వూరు, రాజంపేట నియోజకవర్గ సిద్ధవటం మండల పరిధిలోని గుండ్లామూల ఇసుక రీచ్‌లకు ఆఫ్‌లైన్‌లో గనులశాఖ టెండర్లు పిలిచింది. ఇసుక రీచ్‌ల టెండర్లలో పాల్గొనేందుకు పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ అనుచరులు అలాగే కడప, కమలాపురం ఎమ్మెల్యేల అనుచరులు వచ్చారు. రెండు రీచ్‌లకు టెండర్లు దాఖలు చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ బి.టెక్ రవి అనుచరులు పెద్దఎత్తున టెండర్ గదిలోకి చొచ్చుకుపోయారు. అనంతరం గదిలోకి ఎవ్వరూ రాకుండా తలుపులు మూసివేసేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో కడప, కమలాపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధుల, సిద్ధవటం మండలానికి చెందిన జనసేన నాయకులు పెద్దఎత్తున కార్యాలయం లోపలికి వెళ్లేందుకు చొచ్చుకువచ్చారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇసుక రీచ్‌ల టెండర్ల దాఖలు వ్యవహారం దాదాపుగా స్తంభించిపోయింది. పోలీసుల రంగప్రవేశం అనంతరం వ్యవహారం కొలిక్కి వచ్చింది.కలెక్టర్ ఆదేశాల ప్రకారం తదుపరి షెడ్యూలు ప్రకారం వెళ్తామని గనులశాఖ డిడి పేర్కొన్నారు.