ప్రజాశక్తి-అనకాపల్లి
ఉమ్మడి విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో సిపిఎం ఎదుగుదలకు కామ్రేడ్ ఎ.బాలకృష్ణ చేసిన కృషి ఎనలేనిదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. సిపిఎం సీనియర్ నేత, ప్రజా నాయకుడు కామ్రేడ్ ఎ.బాలకృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఆయన చిత్రపటానికి కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఎస్‌ఈజెడ్, ఎన్‌ఏఓబి నిర్వాసితుల తరుపున, నల్ల బెల్లం, సుగర్ ఫ్యాక్టరీలు, రైవాడ రైతులు, రైతు, కౌలు రైతుల సమస్యలపైనా బాలకృష్ణ అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. విద్యార్థి దశలోనే వామపక్ష భావాలకు ఆకర్షితులై చివరి వరకూ తను నమ్మిన ఆశయ సాధనకు కృషి చేశారన్నారు. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తానున్నానని వెంటనే భరోసాగా నిలబడేవారని తెలిపారు. నేడు బాలకృష్ణ మన మధ్య లేకపోవడం ఉద్యమానికి తీవ్ర లోటన్నారు. నేడు ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాడటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు పెంటకోట శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు బి.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.శంకరరావు, జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావు, అల్లు రాజు, గంటా సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలి : మండలంలోని రేగుపాలెంలో రైతు నాయకులు ఎ.బాలకృష్ణ చిత్ర పటానికి ఆశా వర్కర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చింతకాయల శివాజీ, ఆశా వర్కర్ల సంఘం కార్యదర్శి లక్ష్మి, ఆశాలు కనకకుమారి, వరలక్ష్మి, బీబీరాణి, కుమారి, సత్యవతి, రమణకుమారి, రత్నవేణి తదితరులు పాల్గొన్నారు.
చోడవరం : రైతు సంఘం నేత, ఎ.బాలకృష్ణ ప్రథమ వర్థంతి సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం చోడవరంలో నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు, ఎస్‌వి నాయుడు, కె.వరలక్మి, చంద్రశేఖర్, దేముడు, చంద్రరావు తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో చెరుకు రైతులు, కౌలు రైతుల సమస్యలపైనా బాలకృష్ణ చివరి వరకు అనేక ఉద్యమాలు నిర్వహించారని నాయకులు తెలిపారు.
పరవాడ : రైతు సంఘం నాయకులు ఎ.బాలకృష్ణ ప్రథమ వర్థంతి మంగళవారం మండలంలోని వాడచీపురుపల్లి పిహెచ్‌సి వద్ద, వాడచీపురుపల్లి గ్రామంలోనూ నిర్వహించారు. బాలకృష్ణ చిత్రపటానికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం, ఆశా యూనియన్ నాయకురాలు సిహెచ్.ముత్యాలమ్మ పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. అనకాపల్లిలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై బాలకృష్ణ చేసిన పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు కె.ఆదిలక్ష్మి, ఎ.వరలక్ష్మి, ఈ.పరదేశమ్మ, మౌనిక పాల్గొన్నారు.
మునగపాక : స్థానిక పిహెచ్‌సి ఆవరణలో రైతు నాయకులు ఎ.బాలకృష్ణ ప్రథమ వర్ధంతి మంగళవారం ఘనంగా జరిగింది. బాలకృష్ణ చిత్ర పటానికి సిఐటియు నాయకులు ఎస్ బ్రహ్మాజీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కౌలు రైతు సంఘం నాయకుడిగా బాలకృష్ణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాధించారన్నారు. కార్యక్రమంలో ఆశాలు ఈశ్వరపు పార్వతి, మద్దాల జయ పద్మ, కుమారి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్ : స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకలు ఎ. బాలకృష్ణ ప్రథమ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. బాలకృష్ణ చిత్రపటానికి ఎల్.గౌరి, కెవి సూర్యప్రభ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటి సబ్యుడు అడిగర్ల రాజు మాట్లాడుతూ సిపిఎం నేత బాలకృష్ణ నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేసారన్నారు. రానున్న రోజుల్లో బాలకృష్ణ సూచించిన మార్గంలో పయనిస్తూ, ప్రజాశ్రేయస్సుకు, ఆయన ఆశయసాధనకు కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకలు ఈరెల్లి చిరంజీవి, టి ఈశ్వరరావు, కె రామకృష్ణ పాల్గొన్నారు.