ప్రజాశక్తి -రెంటచింతల : గురువారం రాత్రి ఈదురు గాలులు బలంగా వియడంతో మంచి అదునులో ఉన్న అరటి తోటలు నేల వాలి రైతులకు భారీ నష్టం వచ్చింది. మిట్టగుడిపాడు, రెంటచింతల, రెంటాల, మంచికల్లు గ్రామాల్లో 18 ఎకరాల్లో సాగవుతున్న అరటి తోటలన్నీ పడిపోయాయి. చెట్లకున్న అరటి గెలలన్నీ పడిపోయాయి. కొంతమంది రైతులు అప్పటికే పొలాలకు నీళ్లు పెట్టగా ఆ నీళ్లల్లో అరటి గెలలు మునిగిపోయాయి. ఎకరానికి వెయ్యి గెలల అరటి కాసిందని, అవన్నీ చేతికి దక్కకుండా పోయాయని రైతులు వాపోతున్నారు. ఒక్కొక్క గెలకు 300 కాయలు కాశాయని, తోట ఆశాజనకంగా ఉందనుకుంటున్న తరుణంలో గాలి బీభత్సం తమను నట్టేట ముంచిందని కన్నీరు మున్నీరవుతున్నారు. ఎకరాకు రూ.లక్షన్నర దాకా పెట్టుబడి పెట్టామని చెబుతున్నారు.
ప్రజాశక్తి – విజయపురిసౌత్ : గురువారం రాత్రి తీవ్రమైన గాలి బీభత్సం సృష్టించడంతో నాగార్జున సాగర్ జలాశయంలో మత్యకారుల మరబోట్లతో పాటు పుట్టీలు, వలలు ధ్వంసయ్యాయి. విజయపురిసౌత్‌లోని డౌన్ మార్కెట్‌కు చెందిన అర్జిల్లి సింహాద్రి, బొందు రాజులు కృష్ణా జలాశయంలో చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చేపల వేట అనంతరం బోట్లు, పుట్టీలను జలాశయం ఒడ్డున తాడుతో కట్టి నిలిపివేస్తుంటారు. ఎప్పటిలాగే చేపల బోట్లను ఒడ్డున నిలిపి ఉంచగా గురువారం రాత్రి అకస్మాత్తుగా భారీగాలి వచ్చింది. మత్యకారులు సాగర్ జలాశయం వద్దకు చేరుకొని బోట్లను, పుట్టిలను కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే అవి ధ్వంసమయ్యాయి. అర్జిల్లి సింహాద్రికి చెందిన మర బోటు, 2 పుట్టీలు, 4 మూటల వలలు దెబ్బతినడంతో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లగా, బొందు రాజుకు చెందిన మర బోటు, పుట్టి ధ్వంసం అవడంతో రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
