ప్రజాశక్తి-పెందుర్తి : జివిఎంసి 92వ వార్డు పరిధి బంటా కాలనీ వాసులకు ఎల్‌జి పాలిమర్స్ నష్టపరిహారం ఇవ్వాలని ఆదివారం కాలనీవాసులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, ఎల్‌జి పాలిమర్స్ తమ కాలనీకి సుమారు కిలోమీటర్ దూరం కన్నా తక్కువ ఉందని తెలిపారు. రెండు కిలోమీటర్ల దూరం ఉన్న కాలనీవాసులకు నష్ట పరిహారం ఇచ్చారని, తమకు మాత్రం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని నాయకుల తప్పిదాలు వల్ల కాలనీవాసులు ఎంతో నష్టపోయారని తెలిపారు. 2020లో సంఘటన జరిగినప్పుడు ప్రాణ భయంతో అందరమూ పరుగులు తీశామని, చాలామంది అస్వస్థకు గురయ్యారని వివరించారు. తమ సమస్యను అప్పటి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ఇప్పుడు చర్మవ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లాలని కోరారు. నష్ట పరిహారం చెల్లించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంటాకాలనీ గ్రామ సంఘం ప్రెసిడెంట్ ఎస్.అప్పలరాజు, సెక్రటరీ సాయి, జాయింట్ సెక్రెటరీ ఆనంద్, క్యాషియర్ వినోద్, అధ్యక్షులు చినబాబు, సలహాదారులు ఈశ్వరరావు, కమిటీ మెంబర్లు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.