ప్రజాశక్తి- పులివెందుల టౌన్ భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. పెరిగిన ఎండ తీవ్రత ఎన్నడు లేని విధంగా 40 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంది. మార్చి ప్రారంభం నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. భానుడు భగభగలు తారా స్థాయికి చేరాయి. మంగళవారం జిల్లాలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఎండను దష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి మూడు, మార్చి మొదటి, రెండో వారాల్లో భానుడి భగభగలు మొదలై ప్రస్తుతం ఎండ తీవ్రత పెరిగింది. వారం రోజుల నుంచి ఎండ తీవ్రరూపం దాల్చింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జిల్లాలో గతేడాది ఇదే సమయానికి పగటి పూట అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా ప్రస్తుతం 40 డిగ్రీలకు చేరుకుంది. మైదుకూరులో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగానూ అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ఎండ సెగ తీవ్ర స్థాయిలో కనిపించింది. ఎండ ధాటికి తట్టుకోలేక నగరంలో మధ్యాహ్నం పూట రోడ్ల మీద జన సంచారం పలుచబడింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రోడ్ల మీద జనం చాలా తక్కువగా కనిపించారు. అత్యవసర పనుల విషయంలో మినహాయించి మిగతా సందర్భాల్లో రోడ్ల మీదకు వచ్చేందుకు జనం జంకే పరిస్థితి ఏర్పడింది. పులివెందుల ప్రధాన కూడలలో మధ్యాహ్నం పూట నిర్మానుష్యంగా కనిపించాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. అవసరమై రోడ్ల మీద తిరిగేవారు ఎక్కువగా చెట్ల నీడను ఆశ్రయిస్తూ కనిపిస్తున్నారు.ఎక్కువ ప్రమాదం ఎవరికంటే ఎండ సమయంలో బయట ఎక్కువగా తిరగడం వల్ల పిల్లల్లో ఎక్కువగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. చిన్నారులు, వద్ధులు, గర్భిణులు, క్రీడాకారులు, బాలింతలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీర్ఘకాలక వ్యాధులు, స్థూలకాయం ఉన్నవారు, మద్యం ఎక్కువగా తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.జాగ్రత్తలు తప్పవంటున్న నిపుణులు ప్రజలు బయట తిరిగే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ వంటివి తగలకుండా నీటిని ఎక్కువగా తీసుకుంటూ సాధ్యమైనంత వరకు నీడలో ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలిన తరువాత మళ్లీ ఎండలోకి వెళ్లకూడదని, చల్లని నీడలో విశ్రాంతి తీసుకోవాలని అంటున్నారు. బయట తిరిగే సమయంలో తలకు టోపీ పెట్టుకోవాలని, గొడుగు వాడాలని, రోజుకు ఐదు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలని, సమయానికి ఆహారం తీసుకోవాలని, ఉప్పు కలిపిన ద్రవాలు తాగాలని, శరీరంలో నీటి శాతాన్ని పెంచుకునేందుకు పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు తాగాలని, వదులైన కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.పుచ్చకాయల వ్యాపారం జోరు భానుడి భగభగలకు ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. షరబత్ బత్తాయి, చెరకు రసాలతో తోపుడు బండ్లు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. జాతీయ రహదారి పక్కన కొబ్బరి బోండాలు అమ్ముడుపోతున్నాయి. గ్రామాల్లో గిరాకీ బాగుంటుందని ఐస్క్రీం విక్రయిస్తున్నారు. వీటితో పాటు పుచ్చకాయల వ్యాపారం జోరుగా సాగుతోంది.ఒఆర్‌ఎస్ తీసుకోవాలి.. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువైపోతుంది. అందువల్ల ఆశా కార్యకర్తలు గ్రామాల్లోని ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలి.ఒఆర్‌ఎస్ ద్రావణం అందుబాటులో ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గర్భిణులు బయటికి రావాలంటే గొడుగు సహాయం తీసుకోవాలి, మజ్జిగ, పండ్ల రసం ఎక్కవగా తీసుకోవాలి.-డాక్టర్ సుకన్య, వైద్యాధికారి
