మద్యంపై జనసేన యుద్ధం

Feb 24,2024 23:36

ప్రజాశక్తి – రేపల్లె
వైసీపీ ప్రకటించిన సిద్ధం పోస్టర్లపై జనసేన ఆధ్వర్యంలో యుద్ధం ప్రకటించినట్లు జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ తెలిపారు. స్థానిక సమస్యలను అజెండాగా చేసుకుని వైసీపీపై జనసేన సిద్ధాంత పరమైన యుద్ధం ప్రారంభించినట్లు తెలిపారు. సిద్ధంకి రోజుకో యుద్ధం! పేరున కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేతే మద్యం అమ్మించడంపై మండిపడ్డారు. మద్యం అలవాటు ఉన్నవారు ప్రభుత్వం అమ్మే నాణ్యత లేని దిక్కుమాలిన మద్యం త్రాగి అనారోగ్యంతో మరణిస్తున్నారని అన్నారు. ఈ మద్యం తాగడం వల్ల మత్తులో మితిమీరి నేరపూరిత పనులకు పాల్పడుతూ సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే 5ఏళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా హామిగా చూపించి అప్పులు తీసుకురావటం అంటే తాగుబోతులను తాకట్టు పెట్టటమేనని అన్నారు. మాటకి ముందు ఓ సారి మాటకి తరువాత ఓ సారి మాట తప్పును, మడమ తిప్పను అనే జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం హామీ విషయంలో ఎందుకు మాటమీద నిలబడలేదని ప్రశ్నించారు. ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దించి జనసేన, టిడిపి ప్రభుత్వాన్ని స్థాపించేందుకు జనం కూడా సిద్ధం అంటున్నారని తెలిపారు. తెలుగు మహిళా నాయకురాలు యలవర్తి లక్ష్మీ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి మహిళలు నా తోబుట్టువులు అంటూనే తను అమ్మే కల్తీ మద్యం ద్వారా ఎంతో మంది మహిళల తాళిబొట్లు తెంచేశాడని అన్నారు. వాళ్ళ ఉసురు ఊరికే పోదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు మహిళలే తగిన రీతిలో బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పట్టణ నాయకులు దేవగిరి శంకర్, ఈపూరి సురేష్, టిడిపి పట్టణ అదక్షులు గోగినేని రామరావు పాల్గొన్నారు.

➡️