కార్యకర్తల కృషితోనే భారీ మెజారిటీ

Jun 8,2024 23:30 ##Battiprolu #tdp

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఎన్నికల ముందు ఆనందబాబుకు ఇచ్చిన హామీ మేరకు భట్టిప్రోలు గ్రామంలో టిడిపికి మూడు వేల ఓట్లు మెజార్టీని సాధించడం గర్వకారణంగా ఉందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మాజీ సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించారని అన్నారు. గడచిన ఐదేళ్లు అభివృద్ధిని మరచి బటన్ నొక్కే పనులకే పరిమితం కావడంతో నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో భట్టిప్రోలులో పది విడతలు పోరుబాట కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఎన్నికల ముందు గ్రామంలో వైసిపికి చెందిన 300 కుటుంబాలు ఒకేసారి టిడిపిలో చేరటం, అధికారులు, నాయకులు కలసి ఉపాధి హామీ పథకంలో చేసిన అవినీతిని ప్రజలకు వివరించడంతో ప్రజలు ఆలోచించారని అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి, గతంలో టిడిపి ప్రభుత్వ కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకు వెళ్ళటం వంటి అనేక అంశాలతో ప్రజల్లో మార్పులు తీసుకువచ్చి టిడిపి వైపు ఆకర్షితులుగా చేయగలిగినట్లు చెప్పారు. వైసిపి వైఫల్యాలు ఎండగట్టడం వలన నేడు టిడిపికి 3వేల ఓట్ల మెజారిటీ సాధించినట్లు తెలిపారు. భట్టిప్రోలు గ్రామ పంచాయతీలో గడిచిన ఐదేళ్లలో రూ.6కోట్లు వివిధ రూపాల్లో నిధులుగా రాగా వాటిలో ఎలాంటి ఖర్చులు లేకుండానే పాలకవర్గం రూ.2.50కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి అంశాలను కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం టిడిపికి అనుకూలమైందని అన్నారు. జగనన్న కాలనీలో గృహాలు నిర్మిస్తామని కాంట్రాక్టు తీసుకుని వాటిని పూర్తి చేయకుండా అవినీతికి పాల్పడటం, కాలనీల్లో కనీసం మౌలిక వసతులు లేకపోవడం వంటి పరిస్థితులను స్వయంగా పరిశీలించి ప్రజల స్థితిగతులను తెలుసుకొని వారికి టిడిపి గెలుపొందాక తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అందుకే ప్రజలు టిడిపికి ఓటు బ్యాంకుగా మారారని అన్నారు. ఈ పంచాయతీలో అవినీతితోపాటు మండల స్థాయిలో జరిగిన అనేక అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయించి జరిగిన అవినీతి మొత్తాన్ని బయటికి తీసి చర్యలు తీసుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వైసిపి అరాచక పాలనలో టిడిపి నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులు, అక్రమ కేసులను కూడా ఎదుర్కొని దానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తానని హెచ్చరించారు. టిడిపి, జనసేన ఆధ్వర్యంలో రానున్న ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎడ్ల జయశీలరావు, కంభం సుధీర్, జంగం సాంసంన్, టైలర్ నాగేశ్వరరావు, బుజ్జి పాల్గొన్నారు.

➡️