- ప్రయివేటు నర్సింగ్ కళాశాల బస్సు దగ్ధం
- డ్రైవర్ అప్రమత్తంతో విద్యార్థినులకు తప్పిన ప్రమాదం
ప్రజాశక్తి-చెరుకుపల్లి (బాపట్ల జిల్లా) : షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఓ ప్రయివేటు విద్యా సంస్థకు చెందిన బస్సు దగ్ధమైంది. బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బాపట్ల జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన ఐఆర్‌ఇఎఫ్ నర్సింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు పరీక్ష రాసేందుకు గుంటూరు జిజిహెచ్‌కి బస్సులో వెళ్తున్నారు. బస్సు గూడవల్లి గ్రామం వద్దకు రాగానే ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. వెంటనే విద్యార్థులను బస్సు నుంచి కిందికి దిపారు. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థినులు ఉన్నారు. బస్సు డ్రైవర్ చాక్యచక్యంగా వ్యవహరించడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. రేపల్లె అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది.