ప్రజాశక్తి-పర్చూరు : సంక్రాంతి పండుగ సందర్భంగా మండల పరిధిలోని అన్నంబొట్లy ారిపాలెంలో ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభ మయ్యాయి. గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు ఈనెల 16 వరకూ జరుగుతాయని నిర్వాహకులు కొనకంచి సుబ్బారావు తెలిపారు. 9 క్వింటాళ్ల బండను 15 నిమిషాల సమయంలో ఎక్కువ దూరం లాగిన జతను విజేతగా ప్రకటిస్తారని తెలిపారు. శుక్రవారం 4 పళ్ళ విభాగంలో జరిగే పోటీలో 10 ఎడ్ల జతలు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. విజేతలకు మొదటి బహుమతిగా 30,116, రెండవ బహుమతిగా 20,116, మూడవ బహుమతిగా రూ.18,116, నాల్గవ బహుమతి రూ.15,116, ఐదవ బహుమతిగా రూ.12,116 అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి విభాగంలో 9 బహుమతులు ఉంటాయని తెలిపారు. కడపటి వార్త అందే సరికి పల్నాడు జిల్లా, చాగంటి శ్రీనివాసరావుకి చెందిన ఎడ్ల జత 15 నిమిషాల వ్యవధిలో 9 క్వింటాళ్ళ బండను 4,034 అడుగుల దూరం లాగి ముందంజలో ఉంది. ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు చుట్టు ప్రక్కల గ్రామాలను ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది.పర్చూరుతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఈ పోటీలను తిలకించేందుకు వచ్చారు. వ్యాఖ్యాతలుగా రాయంకి వేమారెడ్డి, గూడ శ్రీనివాసరావు, అంపైర్ గా పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/paruchuru-yeddulu.jpg)