విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : కలెక్టర్ పి రంజిత్ భాషా

Feb 10,2024 00:05

ప్రజాశక్తి – చీరాల
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యుతతో పాటు కనీస వసతుల్లో ఎలాంటి లోపాలున్న నిర్వహకులపై చర్యలు తప్పవని కలెక్టర్ పి రంజిత్ భాషా హెచ్చరించారు. మండలంలోని వాడరేవులో గ్రామదర్శిని నిర్వహించారు. వాడరేవులో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. అంగన్‌వాడి కేంద్రం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రం, జగనన్న కాలని, సచివాలయాలను ఆయన ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు, ఇతర సిబ్బంది సామాజిక స్పృహతో పనిచేయాలని అన్నారు. అట్టడుగు వర్గాలకు సైతం ప్రభుత్వ సేవలు అందించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులందరిపై ఉందన్నారు. విద్యా, వైద్యం, స్థిరనివాసం, తాగునీరు వంటి అవసరాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చూడాలని అన్నారు. ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అక్కడ నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, నిధులు లేక అర్ధాంతరంగా నిలిచిన భవన నిర్మాణాలను పరిశీలించారు. 814మంది విద్యార్థులు అభ్యసిస్తుండడంపై ఆరా తీశారు. తరగతి గదులు, డిజిటల్ తరగతులు, మరుగుదొడ్లు, కంప్యూటర్ శిక్షణ, నిత్యాసర సరుకుల నిల్వలను పరిశీలించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. రక్తహీనత, నులిపురుగులు నివారణతో ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్తలను వివరించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అవగాహన కల్పించారు. యూనిఫామ్, పుస్తకాలు, నోట్ బుక్స్, షూలు పంపిణీపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటగది లేకపోవడం, ఏజెన్సీ నిర్వాహకులు బయట నుంచి తెచ్చి పెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు శుభ్రతగా లేకపోవడంతో హెచ్‌ఎంకు మెమో ఇవ్వాలని ఎంఈఓను ఆదేశించారు. చిన్నారులకు నాణ్యమైన భోజనం తయారుచేసి వడ్డించాలని చెప్పారు. అంగన్ వాడి కేంద్రంలో ఏడాదిన్నరగా కార్యకర్త లేకపోవడంపై అసహన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని అన్నారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, ఏఎన్ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం పక్కాగా అమలు చేయాలన్నారు. నూతన భవనాన్ని త్వరగా నిర్మించేలా పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ అందుబాటులో ఉంచాలని అన్నారు. సచివాలయం ద్వారా అన్ని సేవలు ప్రజలకు చేరాలన్నారు. కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేయకుండా సచివాలయంలో ఉంచడంపై ఆరా తీశారు. సంబంధిత విఆర్ఓకు ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. ముగ్గురు సచివాలయ సిబ్బంది సెలవులో ఉండడంపై అసహన వ్యక్తం చేశారు. సచివాలయాల సిబ్బందికి సెలవులు రద్దు చేయాలన్నారు. విధుల నిర్లిప్తతపై అసహనం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా లబ్ధిదారులను చైతన్య పరచాలన్నారు. నిర్మాణం చేస్తున్న వారికి బిల్లులు ఆపకుండా తక్షణమే చెల్లించాలన్నారు. ఆయన వెంట ఆర్డిఓ సూర్యనారాయణరెడ్డి, డిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్ ఎస్ విజయమ్మ పాల్గొన్నారు.

➡️