ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Feb 24,2024 23:38

ప్రజాశక్తి – రేపల్లె
ఓటర్ల జాబితా సక్రమంగా రూపొందించటంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి, ఆర్డీఓ హేల షారోన్ హెచ్చరించారు. పట్టణంలోని వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్లో బిఎల్ఓలతో సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాను నిశిత పరిశీలనతో మార్పులు, చేర్పులు చెయ్యలన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించిన విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి బిఎల్ఓ తమకు ఇచ్చిన ఓటర్ జాబితాను పరిశీలించి వీలైనంత వరకు డెత్ కేసులు, ఇతర ప్రాంతాల్లో ఓట్లు ఉండి ఇక్కడ ఉంటే వారి అనుమతితో తొలగించాలని అన్నారు. అనంతరం స్వీప్ యాక్టివిటి అమలు చేస్తున్న తీరుపై బిఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. సమస్యత్మాక పోలింగ్ స్టేషన్లు గుర్తించారా? అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలని కోరారు. 91వ పోలింగ్ స్టేషన్ మోళ్ళగుంట బిఎల్ఓ నరేంద్ర బాబును వివరణకోరారు. తనకు ఎటువంటి అవగాహన లేదని సమాధానం చెప్పటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 91వ పోలింగ్ స్టేషన్లో గతంలో రెండు కొట్లాట కేసుకు నమోదైనట్లు చెప్పారు. బిఎల్ఓ పరిధిలోని ఓట్లలో పురుషులు, స్త్రీలు, ట్రాన్స్‌ జెండర్‌ ఎంత మంది ఓటర్లు ఉన్నారనే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో నగరం, నిజాంపట్నం, రేపల్లె, చెరుకుపల్లి తహశీల్దారులు, సూపర్ వైజర్లు, బిఎల్ఓలు పాల్గొన్నారు.

➡️