ప్రతి నిర్మాణానికి అనుమతులు తప్పనిసరి : బావుడా వైస్ చైర్మన్ బాబురావు

Jun 11,2024 23:10 ##Bapatla #Urban #Chairman

ప్రజాశక్తి – బాపట్ల
బాపట్ల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (బావుడ) పరిధిలో చేపట్టే నిర్మాణాలు, కట్టడాలకు అనుమతులు తప్పనిసరని బాపట్ల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కె బాబురావు అన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాలతోపాటు కాకుమాను, పెదనందిపాడు మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు తీసుకున్న అనంతరం నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. బాపట్ల అర్బన్ డెవలప్ మెంట్ పరిధిలో రెండు పురపాలక సంఘాలతో పాటు పంచాయతీలు కూడా ప్రతి నిర్మాణంకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. బహుళ అంతస్తులతో సహా అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతి పరిధిలో భవన నిర్మాణాలకు అనుమతులను మ్యానువల్‌గా కాకుండా ఆన్‌లైన్ విధానాన్ని బావుడ అమలు చేస్తుందన్నారు. ఆన్‌లైన్ విధానంలో లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్‌ ద్వారా దరఖాస్తు చేయించి పంచాయతీలకు సంబంధించిన ఫీజులు, బావుడా అభివృద్ధి ఫీజులు చెల్లించిన తర్వాత పంచాయతీ కార్యదర్శులు అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. 300చదరపు మీటర్లలోపు నిర్మించుకునే నివాస భవన నిర్మాణాల అనుమతి మంజూరు చేసే అధికారం పంచాయితీ కార్యదర్శులకు, నివాసేతర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారం బావుడాకు ఉందన్నారు. నూతన ఆన్‌లైన్ విధానంపై పంచాయతీల్లో ప్రజలకు అవగాహన కల్పించి పంచాయతీ పరిధిలో ప్రణాళికా బధ్ధంగా భవనాలు, లేఔట్లు నిర్మించి పంచాయతీల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు, బావుడ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనుమతుల మంజూరులో జాప్యం జరగకుండా త్వరితగతిన భవన నిర్మాణలకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిఎల్‌పిఓ శంకర్రావు, డిఎల్‌పిఓ స్వరూపరాణి, ఎపిఓ వెంకటేశ్వర్లు, ఈఒపిఆర్డీ ఎలీషా బాబు, పంచాయతీ కార్యదర్శులు, లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్లు, బావుడ సిబ్బంది నరేష్, దివ్య, భార్గవ్ పాల్గొన్నారు.

➡️