ప్రజాశక్తి – చీరాల
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించాలని, లేకుంటే శిక్షర్హులు అవుతారాని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరవ రమేష్ బాబు అన్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు గురువారం నిర్వహించారు. బైక్ రేసులు, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు డ్రైవింగ్ చేయటం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం వంటి నేరాల నుంచి దూరంగా ఉండాలని చెప్పారు. విశిష్ట అతిథిగా హాజరైన చీరాల వన్ టౌన్ ఎస్‌ఐ ఎ హరిబాబు మాట్లాడుతూ నూతన చట్టాలకు అనుగుణంగా హెల్మెట్ లేని వాహనదారులకు భారీగా జరిమానాలు విధించ బోతున్నారని అన్నారు. యువత చట్టానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ క్రమశిక్షణతో మెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కస్తూరినాథ్, బి రామారావు, సోషల్ వర్కర్ విఎస్‌డి మతీన్, ట్రాఫిక్ ఎఎస్ఐ సిహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
