ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా) : ద్విచక్రవాహనాన్ని కారు ఢకొీట్టడంతో ఎఆర్ ఎఎస్‌ఐ మృతి చెందిన ఘటన ఈపురుపాలెం-వెదుళ్లపల్లి చెక్‌పోస్ట్ సమీపంలో బాపట్ల జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. చీరాల నుంచి బాపట్లలోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీరాల, పేరాలలో నివాసం ఉంటున్న సంపూర్ణరావు (50) బాపట్ల పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎఆర్ ఎఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు చీరాల నుంచి ద్విచక్ర వాహనంపై బాపట్లకు వెళ్లారు. బాపట్ల నుంచి చీరాలకు కారులో దొనకొండ ఎస్సై బయలుదేరారు. ఈపురుపాలెం- వెదుళ్లపల్లి చెక్‌పోస్టు వద్ద ఎఆర్ ఎఎస్‌ఐ ద్విచక్రవాహనాన్ని ఎస్‌ఐ కారు బలంగా ఢకొీట్టింది. ఈ ఘటనలో సంపూర్ణరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ ఎస్‌ఐ విజరుకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.