బాపట్ల రూపురేఖలు మారుస్తా : నరేంద్ర వర్మ

Apr 25,2024 01:11 ##tdpnews #bapatla #varma

ప్రజాశక్తి – బాపట్ల
తనను గెలిపిస్తే అభివృద్ది చేసి నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని టిడిపి ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. మండలంలోని నరసాయపాలెం, కంకటపాలెం, మురుకొండపాడు గ్రామాల్లో బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక సమస్యలపై ఆయన మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీరు, వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. గ్రామాల్లో అంతర్గత రహదారులు సైతం సిమెంటు రోడ్లుగా మార్చేస్తానని అన్నారు. రైతులు పొలాలకు వెళ్లే డొంక లింకు రోడ్ల నిర్మాణం, అవసరమైన ప్రాంతాల్లో మరమ్మత్తులు పూర్తిస్థాయిలో చేపడుతామని అన్నారు. అనేక ప్రాంతాల్లో శ్మశానవాటికల సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా టిడిపి సూపర్ సిక్స్ పథకాలను అందించనుందని అన్నారు. వృద్ధులకు నెలకు రూ.4వేలు పింఛన్‌తో పాటు రైతులకు యేడాదికి రూ.20వేలు అందించనున్నట్లు తెలిపారు. చదువుకునే పిల్లలకోసం, ఇంట్లో ప్రతి బిడ్డకూ యేడాదికి రూ.15వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, యేడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించడానికి టిడిపి ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, అభివృద్ధే నినాదంగా టీడీపి, జనసేన కలిసి పని చేస్తాయని అన్నారు. ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధికి సంకేతమైన సంకీర్ణాన్ని గెలిపించుకోవాలని కోరారు. ఎంఎల్‌ఎగా తనను ఎంపీగా తెన్నేటి కృష్ణ ప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌ఛార్జి నామన శివన్నారాయణ, టిడిపి సీనియర్ నాయకులు కామేపల్లి కృషిబాబు, టీడీపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️