ఇండియా కూటమిదే విజయం : కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావు

May 10,2024 00:09 ##repalle #Scancenter

ప్రజాశక్తి – రేపల్లె
ఒకరు నవరత్నాలు, మరోకరు సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఇండియా వేదిక కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపిని ఓడించడం ద్వారానే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి రక్షణ సాధ్యమవుతుందని అన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తు ఇండియా వేదిక ద్వారానే గాడిన పడుతుందని అన్నారు. బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతుగా ఉన్న టిడిపి, జనసేన, వైసిపిని ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. దేశంలో అరాచక పాలన సాగిస్తున్న మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే నియంతృత్వం రాజ్యమేలుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేయడం కోసం మోడీ మరో అవకాశం అడుగుతున్నారని అన్నారు. బిజెపి, ఎన్‌డిఎ కూటమిని వ్యతిరేకించాలని కోరారు. కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే మతోన్మాదం పేట్రేగుతుందని, రాజ్యాంగాన్నే మర్చేస్తారని ఆరోపించారు. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని బిజెపి ఈపాటికే ప్రకటించిందని అన్నారు. మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఇండియా వేదిక అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతినెలా రూ.8333 ఇస్తామని, రైతులు, కార్మికులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని చెప్పారు. ఎంఎల్‌ఎగా తనను, బాపట్ల ఎంపిగా జెడి శీలంను గెలిపించాలని కోరారు.

➡️