ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని పల్లికోన పంచాయతీ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో రూ.30లక్షలకుపైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైసిపి పాలనలో పాలకవర్గం లేకుండానే రెండేళ్లపాటు పంచాయితీలో పనులు నిర్వహించారు. పాలకవర్గం ఏర్పడిన తర్వాత సర్పంచి సహా పంచాయతీకి వివిధ రూపాల్లో విడుదలైన నిధులను ఎలాంటి అనుమతులు, తీర్మానాలు, అంచనాలు లేకుండా వినియోగించినట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. పంచాయతీకి అవసరమైన బ్లీచింగ్, సున్నం, విద్యుత్ బల్బులు, శానిటేషన్ సామాగ్రి తదితర అవసరాలకు కొనుగోలు చేయకుండానే వినియోగించినట్లుగా నిధులు దుర్వినియోగం చేసినట్లు వ్యక్తమౌతుంది. సర్పంచి రాజమ్మ ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఈపాటికే సంబంధించిన అధికారుల విచారణలో తేలింది. వీరి పాలనా కాలంలో అప్పటి మంత్రి మెరుగు నాగార్జున సహకారంతో రూ.30లక్షలకుపైగా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఈపాటికే అధికారుల నిర్ధారించగా దీనిని పూర్తిస్థాయిలో విచారణ జరిపి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన అనంతరం టిడిపి నాయకులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పంచాయతీ శాఖ అధికారులు రికార్డులు తనిఖీ చేయగా నిధులు దుర్వినియోగం జరిగిందని, బ్లీచింగ్, సున్నం వాడకుండానే వాడినట్లు నిధులను సంబంధిత కాంట్రాక్టర్‌కు నిధులు ముట్ట చెప్పినట్లు నిర్ధారించారు. మండలంలోని తాతవారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బ్లీచింగ్, సున్నం సరఫరా వైసీపీ పాలనలో కాంట్రాక్ట్ తీసుకొని సరుకు సరఫరా చేయకుండానే మంత్రి సహకారంతో పంచాయతీ నుండి నిధులు కాంట్రాక్టర్‌కు పంచాయితీ అధికారులు అప్పగించినట్లు నిర్ధారించారు. అదేతరహాలో శానిటేషన్ సామాగ్రి, విద్యుత్ బల్బులు, చేతిపంపు సామాగ్రి కూడా రేపల్లెలో ఓ దుకాణం నుండి పొందినట్లుగా నిధులు అప్పగించారని సమాచారం. ఆ నిధులకు తగిన అనుమతులు, తీర్మానాలు, అంచనాలు ఎక్కడా కనిపించడం లేదని అధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. దీనిపై త్వరలో ఉన్నతస్థాయి కమిటీ పరిశీల జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అధికారుల పరిశీలనలో ముగ్గురు కార్యదర్శులు బాధ్యులుగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ విషయమై పంచాయితీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయితీలో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.30లక్షల నిధులు దుర్వినియోగమైన మాట నిజమేనని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు త్వరలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.
