ప్రజాశక్తి-వేటపాలెం : అకాల వర్షం కారణంగా కరెంట్ సర్వీస్ వైరు చేనేత కార్మికుడిని కాటేసింది. ఈ సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని దేశాయిపేట పంచాయితీ ఆనుమల్లిపేటలో బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది స్థానికుల కథనం ప్రకారం తెల్లవారుజామున అకాలంగా కురిసిన వర్షం ఈదురు గాలులకు కరెంట్ షాట్ సర్క్యూట్ తో సర్వీస్ వైరు తెగిపోయింది. ఇంటి నుండి బయటకు వెళ్లి పాలు తెచ్చుకునేందుకు సిద్ధమైన బొడ్డు మోహన్ రావు(64) అడ్డుగా పడి ఉన్న కరెంటు తీగను తొలగించే ప్రయత్నంలో చేతితో పట్టుకున్నాడు. అంతే క్షణాల్లో అక్కడికక్కడే విగత జీవుడై పడిపోయాడు. స్థానికులు గుర్తించి విద్యుత్ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్సై మీసాల వెంకటేశ్వర్లు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సర్వీస్ వైర్లు పరిశీలించారు. మృతుడి చేనేత కార్మికుడు మగ్గం పనే కుటుంబ జీవనాధారం. మోహన్ రావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.
