రైతులకు కౌలు కార్డు పత్రాలు పంపిణీ

Jul 16,2024 00:47 ##Mundlamuru #ADA #BalajiNaik

ప్రజాశక్తి – ముండ్లమూరు
రైతులు సాగు చేసే ముందు భూసార పరీక్షలు చేయించుకుంటే అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చని, పంట మార్పిడి విధానం అలవర్చుకోవాలని ఎడిఎ బాలాజీ నాయక్ అన్నారు. మండలంలోని పులిపాడు గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రధాన పంటలకు ముందుగా పచ్చి రొట్టె ఎరువులైన జీలుగ, జనము, పిల్లి పెసర, జొన్న, కొర్ర, రాగి, అలసంద, మినుము, పెసర, ధనియాలు, ఆవాలు తదితర రకాలైన వాటితో 45రోజులు పంట సాగు చేసి దుక్కి దున్ని పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఒంగోలు డిఆర్సి ఎఒలు శేషమ్మ, శైలజ మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించి వాటి స్థానంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఎఒ ఎస్‌కెఎండి ఫరూక్ మాట్లాడుతూ కౌలు రైతుల పంట సాగు హక్కు పత్రాలు (సీసీఆర్‌సి) కార్డులు తహశీల్దారు కార్యాలయం లేదా వీఆర్‌ఒల వద్ద తీసుకోవాలని చెప్పారు. వాటి వలన ప్రయోజనాలు రైతులకు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ శాఖ ఎంటి పి ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు ఎరువులు, పురుగు మందులు, క్రిమి సంహారక మందులను వాడటం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చేసిన ఘన జీవామృతం, బీజామృతం, వేప నూనె, దశపర్ని, బ్రహ్మాస్త్రం అగ్ని అస్త్రం, తూటీ కాడ కషాయం, చేప బెల్లం ద్రావణం, మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు నివారణకు మట్టి ద్రావణం వాడి పంటలను, ఆరోగ్యాలను రక్షించుకోవాలని సూచించారు. అర్హులైన రైతులకు వంట సాగు హక్కు పత్రాలు (సిసిఆర్‌సి) కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విఆర్‌ఒ జి కోటయ్య, విఎఎ కె క్రాంతి, ఎల్ టూలు, ఐసిఆర్‌పిలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

➡️