వరి సాగుకు నీళ్లు ఇస్తామని ప్రకటించాలి : రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్

Aug 26,2024 22:47 ##Panguluru #RythuSangham

ప్రజాశక్తి – పంగులూరు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ పరిధిలో ఆరుతడి పంటల సాగు చేసుకోమని ప్రభుత్వం చెప్పటం సరైంది కాదని, ఈ నిర్ణయం మార్చుకొని వరి సాగుకు నీళ్లు ఇస్తామని ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్ని పూర్తిగా నిండిపోయి, నీరంతా సముద్రం పాలవుతుండగా ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయటం సరైనది కాదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, కందిమల్ల రామకోటేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఈపాటికే నిండిపోయాయని, సాగునీరు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని రైతాంగం భావిస్తున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వ ప్రకటన రైతాంగాన్ని నిరాశకు గురిచేసిందని తెలిపారు. 2004లో నాగార్జున సాగర్‌లో 540 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే రైతాంగ ఉద్యమం ద్వారా ప్రభుత్వ మెడలు వంచి మగాణికి సాగునీరు సాధించామని, మాగాణి సాగుకు అప్పటి ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిండా నీళ్లున్నా ఆరుతడి పంటలకే సాగునీరు ఇస్తామనటం సరైంది కాదన్నారు. గతేడాది నీరు లేక మాగాని సాగు తగ్గటం వలన ఈ ఏడాది ధాన్యం రేట్లు, బియ్యం రేట్లు విపరీతంగా పెరిగాయని అన్నారు. పశువులకు మేత కూడా లేకుండా పోయిందని అన్నారు. జిల్లాలోని నాగార్జునసాగర్ కాలువల కింద మాగాణి 72,822-37 ఎకరాలు, ఆరుదడి కింద 1,02,636-52 ఎకరాలు మొత్తం 1,74,918-89 ఎకరాలు సాగవుతుందని చెప్పారు. అయితే ఈ ఏడాది మాగాణి సాగుకు నీరివ్వకపోతే మాగాణి విస్తీర్ణం పడిపోతుందని చెప్పారు. గతంలో పులిచింతల, పట్టిసీమ ప్రాజెక్టుల నుండి నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ సాగర్ కుడికాలువ పరిధిలో ఆరుతడి పంటలకే సాగునీరంటూ ప్రకటన చేయటం సరైనది కాదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే సరి చేసుకొని మాగాణి సాగుకు అనుకూలంగా ప్రకటన చేయాలని, లేకుంటే రైతాంగాన్ని సమీకరించి ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు.

➡️