ప్రజాశక్తి – వేమూరు
స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నందు తగ్గింపు ధరలపై నిత్యవసర సరుకుల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టిడిపి అధికార ప్రతినిధి, ఎఎంసి మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు తెలిపారు. ప్రత్యేక కౌంటర్లో రాయితీపై సరకులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. పేదలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం ఇబ్బందులు తొలగించేందుకు ఎన్నడు లేని విధంగా కూటమి ప్రభుత్వం ప్రజలను ఆదరించాలనే దృక్పథంతో ధరలు తగ్గించి కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.180 ఉండగా రాయితీపై రూ.160కి, సన్న రకం బియ్యం కేజీ రూ.52 ఉండగా రూ.48కి, స్టీమ్ బియ్యం రూ.55.85 ఉండగా రూ.49కి అందజేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ధరలు తగ్గించి పేదల పక్షాన నిలబడే ప్రభుత్వంగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌ఛార్జి ఊసా రాజేష్, డిప్యూటీ తహశీల్దారు కనకదుర్గ, పౌరసరఫరాల శాఖ అధికారులు, తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు.
